logo

పులి జాడ తెలుసుకునేందుకు జల్లెడ

పెద్దపులి నక్కపల్లి మండలంలోకి వచ్చే అవకాశం ఉందంటూ అటవీశాఖ అధికారులు చెప్పినట్లుగానే జరిగింది. నక్కపల్లి మండలం దోసలపాడు మాజీ సర్పంచి గండేపల్లి ప్రకాష్‌ బుధవారం స్థానిక అటవీశాఖ ఉద్యోగులకు ఫోన్‌ చేసి కోటవురట్ల మండలం శ్రీరాంపురం

Published : 30 Jun 2022 06:10 IST

నక్కపల్లి నుంచి కోటవురట్లకు వెళ్లినట్లు నిర్ధారణ

నర్సీపట్నం గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే: పెద్దపులి నక్కపల్లి మండలంలోకి వచ్చే అవకాశం ఉందంటూ అటవీశాఖ అధికారులు చెప్పినట్లుగానే జరిగింది. నక్కపల్లి మండలం దోసలపాడు మాజీ సర్పంచి గండేపల్లి ప్రకాష్‌ బుధవారం స్థానిక అటవీశాఖ ఉద్యోగులకు ఫోన్‌ చేసి కోటవురట్ల మండలం శ్రీరాంపురం వద్ద పులి వెళ్లడాన్ని తమవారు గుర్తించారంటూ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వీరు ఉన్నతాధికారులకు సమాచారం అందించి మెరక గ్రామానికి పయనమయ్యారు. ఈలోగా తిరుపతిపాలెం సమీపంలో పులి అడుగుజాడలు ఉన్నాయంటూ మరికొందరు ఫోన్లలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంతా అటువైపు వెళ్లారు. ఇదే సమాచారం తెలుసుకున్న కాకినాడ డిప్యుటీ రేంజ్‌ అధికారి పద్మావతి తమ సిబ్బంది, రెస్క్యూ టీంతో కలిసి తిరుపతిపాలెం చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి జాడలు ఎక్కడున్నదీ తెలుసుకున్నారు. ఆ మేరకు పులి పాదముద్రలను టేపుతో కొలిచారు. చీడిక, రేబాక, తిరుపతిపాలెం మీదుగా ఇటు వచ్చి ఉంటుందని, అదేవిధంగా నీటిజాడ ఉండటంతో కొండదిగి నీరు తాగి తిరిగి కొండపైకి ఎక్కి ఉంటుందని భావించారు. పాదముద్రల కొలతలు తీసి కాకినాడ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నది ఒకే పులి అని నిర్ధారించారు.

* కాగా గతనెల 28న నర్సీపట్నం మండలం వేములపూడి శివారు అప్పనపాలెంలో రైతు రామారావుకు చెందిన రెండు ఆవుపెయ్యిలపై దాడి చేసి పులి చంపేయడం తెలిసిందే. రెండు రోజుల తరువాత నాతవరం మండలం గాంధీ నగరం సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది.  ఇక్కడ నుంచి జిల్లా సరిహద్దు దాటి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. అడుగులతో అలజడి రేపింది. ఆహారం కోసం ఆవుపెయ్యిలు, గేదెపెయ్యిలను వేటాడింది. దీని జాడ కనిపెట్టేందుకు అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయించారు.  బోనువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడంతో అధికారులు ఉసూరుమన్నారు. ఇప్పుడు కోటవురట్ల మండలంలో సంచారంతో మరోసారి కలవరం మొదలైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని