logo

ప్రాణ‘పథ’ శోధన

ప్రజల ప్రాణాలు కాపాడటంలో వైద్యుల పాత్ర అనిర్వచనీయం. వారి సేవలు ఒక్క గంట ఆగినా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. రోగాలతో బతుకు పోరాటం చేసే రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ వారిని బతికించేలా చికిత్స అందించేందుకు నిరంతరం

Updated : 01 Jul 2022 06:24 IST

నేడు వైద్యుల దినోత్సవం

ప్రజల ప్రాణాలు కాపాడటంలో వైద్యుల పాత్ర అనిర్వచనీయం. వారి సేవలు ఒక్క గంట ఆగినా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. రోగాలతో బతుకు పోరాటం చేసే రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ వారిని బతికించేలా చికిత్స అందించేందుకు నిరంతరం తపిస్తుంటారు.  అంతటితో ఆగిపోకుండా వృత్తి జీవితానికి న్యాయం చేస్తూనే పరిశోధనల్లో రాణించేవారు...పుస్తక రచనల్లో పేరుపొందిన వైద్యులూ ఎందరో. నేడు వైద్యుల దినోత్సవం నేపథ్యంలో అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.


భగవద్గీత... పద్యాల రూపంలో

విజయగీత పుస్తకంతో డాక్టర్‌ పూడిపెద్ది శేషుశర్మ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భగవద్గీతను పద్యాల రూపంలో అనువదించి భావితరాలకు అందించే ప్రయత్నాన్ని డాక్టర్‌ పూడిపెద్ది శేషుశర్మ చేపట్టారు. భగవద్గీత సారాంశం చిన్నారులకూ తేలికగా అర్థమయ్యేలా...అందులోని మహోన్నత భావాలు వారికి చేరువ చేయాలని ఓ ప్రయత్నం ఆరంభించారు. శేషుశర్మ పుట్టి పెరిగారు. విజయనగరంలో. విశాఖ ఆంధ్ర వైద్యకళాశాల్లో ఎంబీబీఎస్‌ చదివి వృత్తిరీత్యా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కేన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ రవిశర్మను వివాహమాడి నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో ప్రసూతి వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా తగినంత సమయం లేకున్నా... అవకాశం దొరికినప్పుడల్లా కథలు రాసే వ్యాపకాన్ని వీడలేదు. ఆ క్రమంలో పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా భగవద్గీతలోని అంశాలను క్రోడీకరించి ‘ఆటవెలది’ పద్యాల రూపంలో ‘విజయ గీత’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. వాటిని ఇటీవలే శ్రీ లలితాంబికా పీఠం అధిపతి శ్రీ సంపూర్ణానందగిరి స్వామి విడుదల చేశారు. రచయితగా మార్చిన సందర్భాలను...తన ఆసక్తిని ఆమె ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

అమెరికాలో 50కి పైగా కథలు: ‘మా తల్లిదండ్రులు వడ్లమాని పద్మావతి, అన్నపూర్ణేశ్వరరావుల వద్ద భాషపై పట్టు పెంచుకున్నా. చిన్నతనంలో భరతనాట్యంలో సాధన చేసి పలు ప్రదర్శనలు ఇచ్చా. సంస్కృతంపైనా, ఇతిహాస గ్రంథాలపైనా మొదటి నుంచీ ఆసక్తి. 1976 నాటికి వైద్యురాలిగా మారా. ప్రవాసాంధ్రులు అమెరికాలో స్థిరపడే సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించడం, జీవనశైలి, సామాజిక అంశాలపై 50కుపై కథలు అమెరికా వెళ్లిన తరువాత రాశా.  వీటిలో అగాథం, చిరుదీపం, ఎండమావులు, ముసురుచీకటిలో మెరుపుకిరణం కథలకు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలోనే భగవద్గీతను వేమన పద్యాల శైలిలో రాయాలనే ఆలోచన వచ్చింది. ఎందరో ప్రముఖుల రచనలు చదివా. ఆంగ్లంలో భగవద్గీత సారాంశం తెలుసుకున్నా. సంపూర్ణానందగిరి స్వామి శిష్యరికంలో పలు జూమ్‌ సమావేశాలు నిర్వహించి చర్చించాం.  ‘విజయగీత’ పేరుతో పిల్లలకు అర్ధమయ్యే రీతిలో పద్యాల రూపంలో భగవద్గీత శ్లోకాలను అనువదించి పుస్తకరూపంలో తెచ్చాం. నా వృత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా.. సమయం లభిస్తే చాలు కథలు రాయడం అలవాటుగా మారింది. ప్రస్తుతం వాషింగ్టన్‌(డీసీ)లో హావర్డ్‌ వైద్యకళాశాల్లో అసోసియేట్‌ ప్రొఫెసరుగా సేవలందిస్తున్నా. విజయగీత పుస్తకం విడుదల కోసం  విశాఖకు వచ్చా. పాఠశాలల పిల్లలకు దీన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే బాగుటుంది. నా ప్రయత్నాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతా.


దంత పరిశోధనలకు అవార్డుల పరంపర

డాక్టర్‌ పద్మశ్రీ

న్యూస్‌టుడే, గాజువాక: చాలా మంది సాధారణ దంత సమస్యలు వస్తే సరైన వైద్య చికిత్స చేయించుకోకుండా తేలిగ్గా తీసుకుని కాలం గడిపేస్తుంటారు. ఆరు నెలలకు ఓ సారి దంత పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు గాజువాకకు చెందిన దంతవైద్యురాలు డాక్టర్‌ పద్మశ్రీ యడ్ల.  ఓ వైపు దంత వైద్యసేవలు అందిస్తూ, మరో వైపు నూతన ప్రయోగాలు చేస్తున్న ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

‘మాది విజయవాడ సమీప గన్నవరం. సిద్ధార్థ దంత కళాశాలలో బీడీఎస్‌ చేశా. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో ఎండీఎస్‌ చేసి అక్కడి నుంచి దంత పరీక్షలు, చికిత్సల్లో నూతన పద్ధతులపై పరిశోధనలు ప్రారంభించా. ఇప్పటికి 12 అవార్డులు సొంతం చేసుకున్నా. వివాహ అనంతరం గాజువాకలో స్థిరపడ్డా.  విజయవాడలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ, ఎండోడాంటిక్స్‌ 36వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో బెస్ట్‌ కేస్‌ రిపోర్టు-2018 (ఎక్స్‌లెన్స్‌) అవార్డును సొంతం చేసుకున్నా. ప్రమాదాలు జరిగినప్పుడు నోటిలో పళ్లు కుదుళ్లతో సహా ఊడిపోతే.. వాటిని పాలలో గానీ, నీటిలో గానీ భద్రపరిచి 48 గంటల్లో ఆసుపత్రికి తీసుకొస్తే ఆ పన్నును అదే స్థానంలో అమర్చవచ్చని నిరూపించిన ప్రయోగానికి 2015లో ఒంగోలు జరిగిన ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ 36వ ఏపీ స్టేట్‌ డెంటల్‌ కాన్ఫరెన్స్‌లో ‘బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డు’ వచ్చింది. పుచ్చు పళ్లకు అత్యాధునిక పద్ధతులు వినియోగించి నరం వరకు వ్యాపించిన క్రిములను తొలగించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో గుజరాత్‌లో జరిగిన 32వ ఇండియన్‌ ఎకడమిక్‌ ఆఫ్‌ కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ ఎండోటిక్స్‌, 25వ జాతీయ సదస్సులో ప్రథమ స్థానం లభించింది.   పన్ను విరిగిపోతే... సిమెంట్‌ పూతకు బదులుగా సిమెంట్‌, పైబర్‌ మిశ్రమంతో పూడ్చే విధానాన్ని ప్రయోగ పూర్వకంగా నిరూపించడంతో గీతం యూనివర్సిటీలో జరిగిన సదస్సులో మొదటి బహుమతి దక్కింది.  వీటితో పాటు పలు ప్రయోగాలు చేసి రాష్ట్రంతో పాటు, జాతీయస్థాయిలో జరిగిన సదస్సుల్లో నిరూపించడంతో అవార్డులు, జ్ఞాపికలు దక్కాయి.


వ్యాపకాలతో ‘గుండె’ ఆరోగ్యం పదిలం


తాను గీసిన చిత్రాలతో డాక్టర్‌ సుజిత్‌ కుమార్‌ మొహంతి

ఈనాడు, విశాఖపట్నం: ‘విధి నిర్వహణలో ఒత్తిళ్లను తట్టుకుంటూనే మంచి అలవాట్లు, వ్యాపకాలను పెంచుకోవాలి. ఒత్తిడి సమయంలో వాటిని సాధన చేస్తే మానసికోల్లాసంతోపాటు గుండె ఆరోగ్యాన్నీ పదిలంగా ఉంచుకోవచ్చు’ అంటున్నారు విశాఖ నగరంలో గుండె శస్త్రచికిత్స నిపుణుడిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ సుజిత్‌ కుమార్‌ మొహంతి. వైద్యునిగా రాణిస్తూనే చిత్రకారుడిగానూ ప్రశంసలు పొందుతున్న ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

* ఒడిశాలోని భువనేశ్వర్‌ మా స్వస్థలం. చిన్నప్పటి నుంచి చిత్రాలు గీయడమంటే ఇష్టం. తొలిరోజుల్లో సరదాగా ప్రారంభించా. అందరూ ప్రశంసిస్తుంటే కొన్ని పోటీల్లో పాల్గొన్నా. బహుమతులు రావడంతో చిత్రకళపై మరింత ఆసక్తి పెరిగింది. వైద్య వృత్తిలో ఉన్నా...ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చిత్రాలు గీస్తుంటే అంతులేని సంతృప్తి కలుగుతుంది.

* చిత్రకళలో నాకున్న ప్రావీణ్యం వృత్తిపరంగా కూడా ఎంతో ఉపయోగపడింది. వైద్యశాస్త్రానికి సంబంధించి  తెలిసిన విషయాన్ని ఇతరులకు సులభంగా చెప్పడానికి వీలుగా క్షణాల్లో చిత్రాలు గీయడం అలవాటుగా మారింది.

* పనిఒత్తిడి అధికంగా ఉంటే ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆ పనిపూర్తైన తరువాత అలవాట్లను సాధన చేసుకోవాలి. ఒత్తిడి పరిస్థితులు ఎదురైతే చిత్రాలు గీస్తూ నేను ఉపశమనం పొందుతాను.

* చిత్ర కళలో నాకున్న ప్రావీణ్యానికి ఇప్పటివరకు వందకు పైగా బహుమతులు వచ్చాయి. గతంలో దిల్లీ, ముంబయిల్లో విధులు నిర్వర్తించినప్పుడు సైతం అక్కడా పోటీల్లో పాల్గొన్నా.

* వైద్యరంగ పరిస్థితులు అద్దంపట్టేవి, ప్రకృతి రమణీయత, సంస్కృతి, ఆలయాలు, దేవుళ్లు, ప్రముఖ కట్టడాల చిత్రాలు వందల్లో గీశా.

* గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలతో ‘హార్ట్‌ టు హార్ట్‌’ అనే పుస్తకాన్ని రచించాను. సుమారు వెయ్యి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశా.

* నేను గీచిన చిత్రాలతో ఎండాడలో ఒక ఫ్లాట్‌ను మెడికల్‌ మ్యూజియంగా మార్చాలన్నది ఆలోచన. ప్రజలకు, ప్రత్యేకించి వైద్యులకు కూడా ఉపయోగంగా  ఉండేలా దాన్ని తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం.

* ఇటీవల గుండెజబ్బులకు గురవుతున్నవారిలో అత్యధిక శాతం మంది తీవ్రమైన ఒత్తిడికి లోనౌతున్నవారే. ఒత్తిళ్లకు, మనోవేదనకు, ఆందోళనకు గురైతే కచ్చితంగా రక్తపోటు పెరుగుతుంది. ఆ ప్రభావంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఓర్పు, సహనంతో ఉండేందుకు ప్రయత్నించాలి. రక్తపోటు అదుపులో ఉంటుంది. హృద్రోగాల భయం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని