logo

ధరల మంట.. నడక తంటా

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో మార్పులు అటు అంగన్‌వాడీలపై భారంగా మారడంతో పాటు అటు లబ్ధిదారులను వ్యయ ప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఈనెల నుంచి ఇళ్లకు పౌష్ఠికాహారం ఇవ్వొద్దని, అందరికీ అంగన్‌వాడీ కేంద్రంలోనే వండిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మె

Published : 05 Jul 2022 04:28 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం కోసం పాట్లు

ఈనాడు డిజిటల్‌ అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి

బాక్సులో భోజనం పెట్టుకుంటున్న గర్భిణి

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో మార్పులు అటు అంగన్‌వాడీలపై భారంగా మారడంతో పాటు అటు లబ్ధిదారులను వ్యయ ప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఈనెల నుంచి ఇళ్లకు పౌష్ఠికాహారం ఇవ్వొద్దని, అందరికీ అంగన్‌వాడీ కేంద్రంలోనే వండిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మెనూ ఛార్జీలు పెంచకుండా వండిపెడితే జీతం డబ్బులు కూడా సరిపోవని అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లబ్ధిదారులు కూడా కేంద్రానికి వెళ్లి భోజనం చేయలేమని, దూరభారంగా, వసతుల్లేని కేంద్రాలకు ఎలా వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు.  

వసతి కొరత..దూరాభారం.. : ఉమ్మడి జిల్లాలోని చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేవు. గర్భిణులు, బాలింతలు కూర్చోవడానికి వీలులేని కేంద్రాలు ఎక్కువే ఉన్నాయి. చాలా కేంద్రాల్లో మరుగుదొడ్ల సదుపాయం లేదు. కొన్ని కేంద్రాలలో తినలేక క్యారేజీలు తెచ్చుకుంటున్నారు.  

పాలు, గుడ్లు, నూనె, బియ్యం ప్రభుత్వమే కేంద్రాలకు సరఫరా చేస్తుంది. కూర తయారీకి అవసరమైన కూరగాయలు, పోపు సామగ్రిని అంగన్‌వాడీ నిర్వాహకులే కొనుగోలు చేయాలి. దీనికోసం ప్రభుత్వం మనిషికి రోజుకు కూరగాయలకు రూపాయిన్నర, రవాణా ఛార్జీలుగా 27 పైసలు, గ్యాస్‌కు అర్ధ రూపాయి చెల్లిస్తుంది. ఈ మొత్తం ఎంతమాత్రం సరిపోదని అంగన్‌వాడీ కార్యకర్తలంటున్నారు. ప్రస్తుతం గ్యాస్‌ ధర రూ.1,050 ఉంది. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మెనూ ఛార్జీలు పెంచి వసతులు కల్పించాలని అప్పుడే వండిపెట్టగలమని ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలు అనకాపల్లి కలెక్టర్‌, ఐసీడీఏసీ పీడీకి విన్నవించారు.

పాతపద్ధతే మేలు.. 

అంగన్‌వాడీ కేంద్రానికి మా ఇంటికి దూరం ఎక్కువ. ప్రస్తుతం ఆరో నెల. కేంద్రానికి నడిచిరావడం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూర్చుని తిందామంటే కుర్చీలు లేవు. నేలపై కూర్చోలేకపోతున్నాను. నెలలు నిండిన కొద్దీ నడిచి కేంద్రానికి రావడం కష్టం. పాత విధానమే అమలు చేయాలి..

- బి.హేమలత, రచ్చబండ్ల, గవరపాలెం

శస్త్రచికిత్సలైన బాలింతలు ఎలా వస్తారు.. : 

 మా అమ్మాయికి ఇటీవలే కేజీహెచ్‌లో పెద్ద ఆపరేషన్‌ చేశారు. ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటోంది. మూడు నెలల వరకు ఎక్కడకు వెళ్లొద్దని వైద్యులు చెప్పారు. ఇక్కడేమో కేంద్రం వద్దకు వస్తేనే కోడి గుడ్డు ఇస్తాం, భోజనం పెడతాం అంటున్నారు. ఆపరేషన్‌ చేసుకున్న ఆమె ఎలా నడిచి వస్తుంది. కనీసం క్యారేజీ తెచ్చుకుంటాం ఇమ్మన్నా ఇవ్వడం లేదు. - జి.లక్ష్మి, దిబ్బవీది, అనకాపల్లి

ఇబ్బందుల్లేకుండా అమలుచేయాలి..:

సంపూర్ణ పోషణ పథకం కేంద్రాల దగ్గరే అమలు చేయాలి. గర్భిణి, బాలింతలకు ఇబ్బంది లేకుండా ఈ పోషకాహారాన్ని వండిపెట్టాలి. కొవిడ్‌కు ముందు బాగానే అమలుచేశారు. ఇప్పుడెందుకు సమస్య వస్తుంది?.. గ్యాస్‌ రేటు బాగా పెరగడం వాస్తవమే.. ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎవరికీ ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలుచేయాలి.

- సీతామహలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్‌, అనకాపల్లి లబ్ధిదారుల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని