logo

టీకా వేసుకున్నా వదలని కొవిడ్‌

టీకాలు వేసుకున్న వారినీ కొవిడ్‌ వదలడం లేదని వైద్యులు చెబుతున్నారు. అత్యధిక శాతం తగిన నివారణ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 40 రోజుల విరామం తర్వాత తొలిసారి 109 కేసులు ఒక్క రోజు వ్యవధిలో జిల్లాలో నమోదయ్యాయి

Updated : 06 Jul 2022 05:56 IST

వన్ టౌన్ , న్యూస్‌టుడే

 కొవిడ్‌  నిర్దారణ పరీక్షలు చేసే పరికరాలు 

టీకాలు వేసుకున్న వారినీ కొవిడ్‌ వదలడం లేదని వైద్యు లు చెబుతున్నారు. అత్యధిక శాతం తగిన నివారణ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 40 రోజుల విరామం తర్వాత తొలిసారి 109 కేసులు ఒక్క రోజు వ్యవధిలో జిల్లాలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య పెరిగింది.

* ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత వరకు 84,47,501 డోసుల టీకాలు పంపిణీ చేశారు. 39.12 లక్షల మంది మొదటి డోసు, 40.81 లక్షల మంది రెండు డోసు, 4.53 లక్షల మంది మూడో (ప్రికాషనరీ) డోసు తీసుకున్నారు.

* వయస్సుల వారీ చూస్తే 12-14 ఏళ్లు 2.67 లక్షలు, 15-17 ఏళ్లు 4.35 లక్షలు, 18-44 ఏళ్లు 44.36 లక్షలు, 45-60 ఏళ్లు 21.18 లక్షలు, 60 ఏళ్లు పైబడి వారు 11.80 లక్షల డోసులు టీకాలు తీసుకున్నారు.

* ఉమ్మడి జిల్లా జనాభా 40 లక్షలు కాగా, చంటి పిల్లల మినహా ఇంచుమించు ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. 99 శాతానికిపైగా రెండేసి డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కొవిడ్‌ కేసులు మంగా పెరుగుతున్నాయి. జూన్‌ నుంచి ఈ పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఒక్కరోజు వ్యవధిలో 109 మంది కొవిడ్‌ బారినపడ్డారు. టీకాలు తీసుకున్న వారిలో ఎంత శాతం మంది కొవిడ్‌ బారిన పడుతున్నదీ ఇతిమిద్ధంగా గణంకాలు అందుబాటులో లేవని వైద్యాధికారులు తెలిపారు. అత్యధిక శాతం బాధితుల్లో లక్షణాలు కనిపించడం లేదని, కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వస్తోందని చెబుతున్నారు.

* ‘బాధితుల్లో ఎక్కువ శాతం ఇళ్లలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ బారిన పడిన పలువురు గర్భిణులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా లేదు. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటింపు వంటి చర్యలు తీసుకోవాల’ని వైద్యులు సూచిస్తున్నారు.

కేసుల వివరాలు

* మంగళవారం నమోదైన కేసులు: 109

* కోలుకున్న వారు: 51

* చికిత్స పొందుతున్న బాధితులు: 471

* ఇంతవరకు నమోదైన కేసులు: 1,92,492

* ఇప్పటి వరకు డిశ్ఛార్జి: 1,90,868

* మృతులు: 1153

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని