logo

అద్దె బస్సులకు తపస్సు!!

అద్దె బస్సులిచ్చే గుత్తేదారుల నిమిత్తం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎదురు చూస్తోంది. సొంతంగా బస్సులు సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడం, మరో వైపు అద్దె బస్సులు సమకూరకపోవడంతో

Published : 06 Aug 2022 06:05 IST

ముందుకొచ్చే గుత్తేదారులెవరంటూ ఎదురుచూపులు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ద్వారకా బస్‌స్టేషన్‌లో బస్సులు

అద్దె బస్సులిచ్చే గుత్తేదారుల నిమిత్తం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎదురు చూస్తోంది. సొంతంగా బస్సులు సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడం, మరో వైపు అద్దె బస్సులు సమకూరకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఏడాదిలో కనీసం పది కొత్త బస్సులైనా నగరానికి కేటాయించేవారు.
గత మూడేళ్లుగా కొత్త బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అద్దె బస్సుల కోసం ఆర్టీసీ కొత్తగా ఆన్‌లైన్‌ టెండర్‌ విధానం ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఎంత మంది గుత్తేదారులు దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.

*     మొత్తం 61 బస్సుల ప్రతిపాదన: విశాఖకు మొత్తం 61 అద్దె బస్సులు ప్రతిపాదించారు. అందులో సింహాచలం డిపోనకు 12, వాల్తేరుకు 12, కూర్మన్నపాలెం (సీˆ్టల్‌సిటీ)కి 12, మద్దిలపాలెంకు రెండు, గాజువాక డిపోనకు 8 బస్సులు కేటాయించగా, మిగతావి విశాఖపట్నం-1 డిపోనకు కేటాయించారు. నగర పరిధిలో తిరిగే బస్సుల కేఎంపీల్‌ (కిలోమీటర్‌ పర్‌ లీటర్‌) 5.41గా నిర్ణయించారు.
*    నేడు అవగాహన: ఆర్టీసీకి అద్దె బస్సులివ్వడానికి సిద్ధంగా ఉన్న గుత్తేదారులకు ఎంవీపీకాలనీ బస్‌స్టాండు కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించి, వారి అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు సీటీఎం సత్యనారాయణ తెలిపారు. టెండరులో ఎలా పాల్గొనాలి, రివర్స్‌ టెండరింగ్‌తోపాటు ఇతర అంశాలపైనా అధికారులు గుత్తేదారులకు సమాచారం ఇస్తారని చెప్పారు.

డీజిల్‌ భారం ఆర్టీసీˆదే..
డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీకి అద్దె బస్సులివ్వడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ఆర్టీసీ యాజమాన్యమే డీజిల్‌ ఇచ్చేలా టెండరు నిబంధనల్లో మార్పు చేశారు. అయినా గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా నగర పరిధిలో కేఎంపీల్‌ లక్ష్యం చేరుకోకపోతే గుత్తేదారు ఆర్టీసీకి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* విపరీతమైన ట్రాఫిక్‌, సిగ్నళ్లు, ఎక్కడిక్కడ బస్‌స్టాపులతో ఉన్న నగరంలో సిటీ బస్సులు కేఎంపీఎల్‌ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని పలువురు గుత్తేదారులు భావిస్తున్నారు. మరో వైపు గుత్తేదారులు టెండరులో అధిక ధర కోట్‌ చేస్తే ఆర్టీసీ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.
*  అవసరమైతే రివర్స్‌ టెండర్లు పిలిచి ఎంపికైనవారికి రూట్లు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కిలోమీటరుకు ఎంత మొత్తం చెల్లిస్తారనే అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు