logo

ఆ స్నేహం.. కలకాలం నిలిచేలా!

కుటుంబసభ్యుల్ని, బంధువులను మనం ఎంచుకునే అవకాశం లేదు. పుట్టుకతోనే ఆ బంధాలన్నీ ఏర్పడతాయి. మనస్తత్వానికి నచ్చిన వారిని స్నేహితులుగా ఎంచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అలాంటి స్నేహం కలకాలం నిలిచేలా వీరంతా ఏం చేస్తున్నారో తెలుసుకుందామా..

Updated : 07 Aug 2022 05:51 IST

స్నేహితుల దినోత్సవం నేడు

కుటుంబసభ్యుల్ని, బంధువులను మనం ఎంచుకునే అవకాశం లేదు. పుట్టుకతోనే ఆ బంధాలన్నీ ఏర్పడతాయి. మనస్తత్వానికి నచ్చిన వారిని స్నేహితులుగా ఎంచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అలాంటి స్నేహం కలకాలం నిలిచేలా వీరంతా ఏం చేస్తున్నారో తెలుసుకుందామా..


ఎక్కడున్నా ఏటా రెండుసార్లు కలయిక

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

రూ.30 లక్షలతో నిర్మించిన భవనం

పెదబొడ్డేపల్లి బాలుర గురుకులంలో 36 ఏళ్ల కిందట పదో తరగతి చదివిన 15 మంది మిత్రుల ప్రయత్నం వందల మందిని దశాబ్దాలుగా స్నేహితులుగా కొనసాగేలా చేసింది. 1986 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన బండారు రామచంద్రరావు, కేవీ అప్పారావు తదితర పదిహేను మంది మిత్రులు 2003లో కలుసుకున్నారు. తాము చదువుకున్న గురుకులంలో సమావేశమై పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు. పదో తరగతి పూర్తయిన వారంతా ఏటా ఈ సంఘంలో చేరుతున్నారు. ఏటా డిసెంబరు రెండో ఆదివారం వీరంతా ఈ ప్రాంతంలో పిక్నిక్‌ నిర్వహిస్తారు. వరస క్రమంలో ఓ బృందం ఆతిథ్యం ఇస్తుంటుంది.

ఏటా స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ గురుకులంలో కలుసుకుంటారు. స్నేహితులందరి విరాళం సుమారు రూ.30 లక్షలతో నిర్మించిన భవనం గత ఏడాది డిసెంబరులో పూర్తయింది. ఈ భవనంలో సుమారు రూ.4 లక్షలతో ‘గురుకుల విజ్ఞాన వాహిని’ పేరిట డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల ఏడో తేదీన దీన్ని ప్రారంభించనున్నారు. వంద మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, రెండు కంప్యూటర్లు, ఏసీలు, నాలుగు ర్యాకులు, ఆఫీస్‌ ఫర్నిచర్‌, బీరువాలు, డిజిటల్‌ తెర వంటివి సమకూర్చారు. పూర్వ విద్యార్థులు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి గడిపేందుకు మొదటి అంతస్తులో అతిథి గృహాన్ని ఏర్పాటు చేశారు. పది మంది ఉండేందుకు అవసరమైన వసతులు సమకూర్చుతున్నామని 1986 బ్యాచ్‌ విద్యార్థులు వి.చంటి, ఎ.గోపి వివరించారు.


సేవాతత్పరులు వీరు..

మునగపాక, న్యూస్‌టుడే:

అన్నదానం చేస్తున్న మునగపాక స్వచ్ఛందసేవా సంస్థ సభ్యులు

స్నేహానికి వయస్సుతో పనిలేదు. మనస్సులు కలిస్తే స్నేహబంధం బలపడుతుంది. దీనికి ఉదాహరణగా నిలుస్తున్నారు మునగపాకకు చెందిన పలువురు స్నేహితులు. వీరంతా 35 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వయసున్న వారు. అయినా కలిసికట్టుగా ఉంటారు. ఆ స్నేహాన్ని పది మందికీ ఉపయోగపడేలా చూడాలని సంకల్పించారు. మునగపాక స్వచ్ఛంద సేవా సంస్థగా ఏర్పడ్డారు. బొడ్డేడ ప్రసాదు, సూరిశెట్టిరాము, సూరిశెట్టి కన్నారావు, ఆడారి అప్పలనాయుడు, ఆడారి కృష్ణ, అలంక సూర్యప్రకాశరావు, కింతాడ మోహనరావు, మారిశెట్టి అప్పారావు, దాడి శ్రీరామమూర్తి, సూరిశెట్టి సుధారాణి, జల్లేపల్లి కృష్ణప్ప, మళ్ల సంజీవరావు, అనకాపల్లి సూరిబాబు, దాడి సూరిబాబు, రంగాచారి తదితరులు తలో కొంత విరాళాలు వేసుకొంటారు. ప్రతీ సోమవారం సాంబమూర్తి దేవుని ఆలయ ప్రాంగణంలో పేదలకు అన్నదానం చేస్తున్నారు. వీరి స్నేహం పది మందికి ఆకలి తీర్చుతోంది.


అతడికి గుర్తుగా క్రీడలకు ప్రోత్సాహం

పాయకరావుపేట, న్యూస్‌టుడే


విజేతలకు ట్రోఫీ ఇస్తూ..

కరోనా సమయంలో ఆత్మీయ స్నేహితుడ్ని కోల్పోయిన మిత్ర బృందం కలకాలం నిలిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతడికి క్రికెట్‌ అంటే ప్రాణం కావడంతో పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు పాయకరావుపేటకు చెందిన స్నేహితుల బృందం.నక్కపల్లి మండలం గొడిచెర్లకు చెందిన కె.రామకృష్ణ, యజ్జల చంద్రశేఖర్‌, ధనిశెట్టి బాబి, గొల్లపల్లి నాగు సునీల్‌ స్నేహితులు. వీరంతా క్రికెట్‌ పోటీల్లో పాల్గొనడంతోపాటు టోర్నమెంట్లు నిర్వహించే వారు. కరోనా సమయంలో రామకృష్ణ కొవిడ్‌ బారిన పడి మరణించాడు. కలిసి తిరిగిన స్నేహితుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారంతా ఎంతో వేదన చెందారు. మిత్రుడు జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా చేయాలని భావించారు. రామకృష్ణకు క్రికెట్‌ అంటే ఇష్టం. అతడికి గుర్తుగా పాయకరావుపేటలో క్రికెట్‌ పోటీలకు శ్రీకారం చుట్టారు. విజేతలకు నగదు బహుమతులు ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిభ చూపిన వారికి నగదు ట్రోఫీలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు టోర్నీలు నిర్వహించారు.


సేవలతోనే తృప్తి

పేదలకు వస్త్రదానం చేస్తున్న స్నేహితులు సూర్యప్రకాశరావు, సూరిబాబు

వారిద్దరూ పేద కుటుంబాల్లో జన్మించిన వారే.  కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో ఒకరు ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. మరొకరు వస్త్ర వ్యాపారంలో స్థిరపడ్డారు. మునగపాకకు చెందిన ఉపాధ్యాయుడు అలంక సూర్యప్రకాశరావు, వస్త్ర వ్యాపారి అనకాపల్లి సూరిబాబు చిన్ననాటి స్నేహితులు. రెండు దశాబ్దాలుగా వారి ఇలవేల్పు అయిన సాంబమూర్తి దేవుని ఆలయ నిర్వాహకులుగా ఉన్నారు. ఏటా గ్రామస్థుల సహకారంతో శూలాల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. తాము పేదరికంలో అనుభవించిన బాధలను గుర్తుకు తెచ్చుకొని పేదవారికి తోడ్పాటునందిస్తేనే సంతృప్తి అని భావించారు. 15 ఏళ్ల నుంచి ఏటా సంక్రాంతి పండగలో 300 నుంచి 400 మంది పేదలకు చీరలు, పంచెలు, దుప్పట్లు అందజేస్తున్నారు. మునగపాకలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందజేస్తున్నారు. సేవా కార్యక్రమాలు తమకు ఎంతో తృప్తిని ఇస్తున్నాయని వారు అంటున్నారు.


ఎక్కడెక్కడి వారో ఒక్కటై..

శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన కల్పిస్తున్న అమ్మ థెరిసా ఫౌండేషన్‌ యువతులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:  ‘అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలన్న’ భావనతో సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్న వారంతా స్నేహితులయ్యారు. అమ్మ థెరీసా ఫౌండేషన్‌ పేరుతో 2019 జులై ఐదుగురు స్నేహితులతో ఫౌండేషన్‌ ప్రారంభమైంది. నేడు అనకాపల్లి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన 150మంది చేరారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నెలవారీగా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.

* ప్రాజెక్టు మగువ పేరుతో శానిటరీ ప్యాడ్స్‌ను గిరిజన ప్రాంతాల్లో, వసతిగృహాల్లో విద్యార్థినులకు అందిస్తున్నారు. ఫౌండేషన్‌లోని యువతులతో అవగాహన కల్పించి వారి చేతుల మీదుగా వీటిని అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని