logo

జోరువానలోనూ అర్జీల జోరు

జోరువానను సైతం లెక్కచేయకుండా సోమవారం స్పందనకు భారీగా అర్జీదారులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే అర్జీలతో బారులు తీరారు. స్పందన సెల్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ 5 కౌంటర్ల వద్దకు అర్జీదారులు ఒక్కొక్కరిని పంపించి వివరాలు నమోదు

Published : 09 Aug 2022 05:46 IST

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, జేసీ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జోరువానను సైతం లెక్కచేయకుండా సోమవారం స్పందనకు భారీగా అర్జీదారులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే అర్జీలతో బారులు తీరారు. స్పందన సెల్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ 5 కౌంటర్ల వద్దకు అర్జీదారులు ఒక్కొక్కరిని పంపించి వివరాలు నమోదు చేయించి రసీదు అందించారు. అనంతరం దరఖాస్తు, రసీదుతో నేరుగా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి, డీఆర్‌ఓ వెంకట  రమణను కలసి వినతులు అందించారు. సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ పిలిచి సత్వరమే సమస్యలు నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయా శాఖల అధికారులు అర్జీదారుతో నేరుగా మాట్లాడి సమస్య తెలుసుకొని వివరాలు సేకరించి ఎప్పటిలోగా పరిష్కరిస్తామో తెలియజేశారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 170 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సంబంధితమైనవే ఎక్కువగా ఉన్నాయి. లిఫ్ట్‌ పనిచేయక పోవడంతో వృద్ధులు, దివ్యాంగులు మెట్లు ఎక్కలేక తీవ్ర అవస్థలు పడ్డారు. కనీసం వీరికి సహాయం చేసే వారు కరవయ్యారు. అతి కష్టం మీద మెట్లు ఎక్కి స్పందనలో అర్జీలు ఇచ్చారు. దరఖాస్తులు రాయడానికి కార్యాలయం ఆవరణలో ఎవరూ లేకపోవడంతో నిరక్షరాస్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ధర్నాలు జరుగుతాయని ముందస్తుగా సమాచారం అందడంతో కలెక్టర్‌ కార్యాలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. గ్రామీణ పోలీసులతోపాటు ఏఆర్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులు గుంపులుగా కలెక్టర్‌ కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్లకుండా గేటు వద్ద పహారా కాశారు. అర్జీదారుతోపాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. కొంత మంది పోలీసులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మెట్లు ఎక్కడానికి అవస్థలు పడుతున్న వృద్ధురాలు


సమస్యలపై ఆందోళనలు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలు సంఘాల నాయకులు జోరువానలో ఆందోళనలు చేపట్టారు. బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకరరావు మాట్లాడుతూ గొలుగొండ మండలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెండేళ్లుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. పంచాయతీ కార్మికులు, సహాయకుల సంఘం గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, గొలుగొండ మండల నాయకులు రాజు పాల్గొన్నారు.

* బీసీ వసతిగృహాల్లో పొరుగుసేవల పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఏడాదికి 11 నెలలు మాత్రమే వేతనం ఇస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత పింఛన్లు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని