logo

ఉద్యమ శిఖరి.. టౌనుహాల్

బ్రిటీష్‌ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. అందులో ఉమ్మడి విశాఖ జిల్లా పోషించిన పాత్ర ఒక చరిత్రగా అభివర్ణిస్తారు విశ్లేషకులు.అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం వంటి యోధులు ఇక్కడ ఉద్యమాన్ని ఉద్ధృతంగా నడిపారు.

Published : 10 Aug 2022 05:35 IST

నవీకరించిన టౌన్‌హాలు

బ్రిటీష్‌ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. అందులో ఉమ్మడి విశాఖ జిల్లా పోషించిన పాత్ర ఒక చరిత్రగా అభివర్ణిస్తారు విశ్లేషకులు.అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం వంటి యోధులు ఇక్కడ ఉద్యమాన్ని ఉద్ధృతంగా నడిపారు.

పాతనగరం చెంగలరావుపేట సమీపంలోని టౌన్‌హాలు అప్పటి స్వాతంత్య్ర ఉద్యమాలకు గుర్తుగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఆ అపురూప కట్టడం పోషించిన పాత్రపై ‘న్యూస్‌టుడే’ కథనం..


పదకొండేళ్ల పాటు నిర్మాణం..

1929లో నగర పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీ

సముద్ర తీరానికి సమీపంలో టౌన్‌హాల్‌ ఉండడం (ప్రస్తుత విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఉన్న ప్రాంతం)తో పలు సభలు, పోరాటాలు ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యాయి. 1893లో బ్రిటీషు పాలకుల సమయంలో దీని నిర్మాణం ప్రారంభం కాగా, పదకొండేళ్ల అనంతరం 1904లో అందుబాటులోకి వచ్చింది. 5వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మితమైన ఈ కట్టడానికి అప్పట్లో బొబ్బిలి రాజు రూ.50వేలు విరాళంగా ఇచ్చారు.

* దేశ వ్యాప్తంగా ఖాదీ ఉద్యమం చేపట్టిన మహాత్మాగాంధీ 1929 ఏప్రిల్‌ 28న విశాఖ వచ్చారు. అల్లిపురంలో ఉండే నగర ప్రముఖులు ఏవీ భానోజీరావు బంగ్లాలో బస చేశారు. 29న టౌన్‌హాలు వద్ద జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ నగర పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశీ వస్త్రాలు విడనాడి, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలని అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. నాటి ఖాదీ ఉద్యమానికి టౌన్‌హాలు వేదికగా నిలిచింది.

స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో టౌన్‌హాలు వద్ద జరిగిన సభలో ఎంతో మంది సమర యోధులు పాల్గొని పౌరులను ఉత్తేజపరిచారు. ఉద్యమానికి ఇక్కడి నుంచే ఊపిరిలూదారు.

టౌన్‌హాలుకు సమీపంలోని బీచ్‌లో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. అప్పటి నగర ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉప్పు తయారు చేసి స్వాతంత్య్ర కాంక్షను బలంగా చాటారు.


ప్రముఖుల సందర్శన..

టౌన్‌హాలు వద్ద స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతుగా గుమికూడిన నాటి విశాఖ ప్రజలు

సి.రాజగోపాలాచారి, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సర్‌ సీవీ రామన్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి ప్రముఖులతో పాటు సంగీత శిఖరాలుగా పేరొందిన ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, ద్వారం వెంకటస్వామినాయుడు, బాలమురళీకృష్ణ వంటి ప్రముఖులు ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాటి స్వాతంత్య్ర పోరాటంలో టౌన్‌హాలు కీలక భూమిక పోషించిందని హెరిటేజ్‌ నెరేటర్‌ జయశ్రీ హట్టంగడి పేర్కొన్నారు.

పూర్వకాలం కట్టడం కావడంతో శిథిలావస్థకు చేరింది. ఇటీవల జీవీఎంసీ దాని రూపురేఖలు మార్పు చేయకుండా పునర్నిర్మించి ప్రస్తుత తరానికి అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని