logo

Vizag news : వెంటాడుతున్న..ఫోలిక్‌ యాసిడ్‌ లోపం

మహిళల్లో ఫోలిక్‌ యాసిడ్‌ లోపం కారణంగా వారికి పుట్టబోయే పిల్లల్లో వస్తున్న వెన్ను సంబంధ అవకరాలు (వ్యాధుల)పై కేజీహెచ్‌ న్యూరోసర్జరీ విభాగ వైద్యులు అధ్యయనం చేపట్టారు.

Updated : 10 Aug 2022 07:56 IST

పిల్లల్లో వెన్ను వ్యాధులు

గ్రామాల్లో కేజీహెచ్‌ అధ్యయనం

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

రక్త నమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్‌

మహిళల్లో ఫోలిక్‌ యాసిడ్‌ లోపం కారణంగా వారికి పుట్టబోయే పిల్లల్లో వస్తున్న వెన్ను సంబంధ అవకరాలు (వ్యాధుల)పై కేజీహెచ్‌ న్యూరోసర్జరీ విభాగ వైద్యులు అధ్యయనం చేపట్టారు.

అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పాడేరు, నర్సీపట్నం మండలాల పరిధిలో ఎంపిక చేసిన నెల్లిపూడి, బొర్రంపేట, తుమ్మలబంద, అంకమ్మపాలెం, చీకటిపుట్టి, జీలుగులపుట్టు, గట్టం, కిముడుపుట్ట గ్రామాల్లోని సుమారు వెయ్యి కుటుంబాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం సాగుతోంది.

* తొలి విడతగా 120 మంది రక్త నమూనాలు సేకరించారు. వారిలో ఫోలిక్‌ యాసిడ్‌ సమపాళ్లలో ఉన్నదీ లేనిదీ పరీక్షలు చేస్తున్నారు. ఐరన్‌, అయోడిన్‌ మిళితమైన ఫోర్టిఫైడ్‌ ఉప్పును కుటుంబానికి 2 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నారు. ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉండే మహిళలకుపుట్టే పిల్లల్లో వెన్ను సంబంధ వ్యాధులు వస్తున్నా యంటున్నారు. ఇటువంటి కేసులు నెలకు రెండు నుంచి మూడు వరకు కేజీహెచ్‌ న్యూరోసర్జరీ విభాగానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు కేజీహెచ్‌ న్యూరోసర్జరీ విభాగం శ్రీకారం చుట్టింది. ప్రొఫెసరు పీఆర్‌జే గంగాధరం రీసెర్చ్‌, అకడమిక్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది.

* పరిశోధనకు అవసరమైన నిధులు, ఇతర వసతులను ప్రొఫెసరు గంగాధరం పేరున ఆయన కుమారుడు, అమెరికాలో స్థిరపడ్డ పీడియాట్రిక్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ జోగి.వి.పట్టిసాపు సమకూరుస్తున్నారు.

* ఆంగ్ల పరిభాషలో ‘స్పైన్‌ బిఫిడ’గా పిలిచే ఈ వ్యాధిపై ఈనెల 10న బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సదస్సు నిర్వహిస్తున్నారు. సంబంధిత వివరాలను మంగళవారం ఆంధ్ర వైద్య కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, న్యూరో సర్జరీ విభాగ ప్రొఫెసర్లు డాక్టర్‌ బి.హయగ్రీవరావు, డాక్టర్‌ జోగి.వి.పట్టిసాపు, డాక్టర్‌ ఎంవీవీ విజయశేఖర్‌, సహాయ ప్రొఫెసరు డాక్టర్‌ శివరామకృష్ణ, రీసెర్చ్‌ కోఆర్డినేటరు కె.అనిల్‌కుమార్‌ వెల్లడించారు.

* రామకృష్ణమిషన్‌ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రభావిత గ్రామాల్లో ఉప్పు పంపిణీ, రక్త నమూనాల సేకరణ చేపట్టి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. డాక్టర్‌ హయగ్రీవరావు మాట్లాడుతూ ఫోలిక్‌ యాసిడ్‌ లోపాలు ఉండే మహిళలకు పుట్టబోయే పిల్లల్లో వెన్నుపై కణితులు ఏర్పడడం, పక్షవాతం, కాళ్లు చచ్చు పడిపోవడం, అతిమూత్రం, తెలియకుండానే మల విసర్జన జరుగుతుందని, కొంతమందిలో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. ఆయా అంశాలపై బుధవారం నాటి సదస్సులో చర్చిస్తామని, పలువురు నిపుణులు పాల్గొంటున్నారని వివరించారు.

* మూడు నెలల పాటు పరిశోధన కొనసాగుతుందని, పరిశోధనల అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసి ఫోర్టిఫైడ్‌ ఉప్పు సరఫరా ఆవశ్యకతను తెలియజేస్తామన్నారు. విశాఖ, అల్లూరి జిల్లాల కలెక్టర్ల అనుమతితో అధ్యయనం చేస్తున్నామని, స్వచ్ఛందంగా వచ్చే వారి నుంచే నమూనాలు సేకరిస్తున్నామని వివరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని