logo
Published : 10 Aug 2022 05:35 IST

అవి అడ్డగోలు నియామకాలే..!

కాంట్రాక్ట్‌ సిబ్బంది పేరుతో రెస్కోలో పోస్టింగులు

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌ కార్యాలయం

ఈనాడు డిజిటల్‌,  విశాఖపట్నం: అనకాపల్లి గ్రామీణ సహకార విద్యుత్తు సంఘం (రెస్కో)ని గతేడాది మార్చిలోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి ఈపీడీసీఎల్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటివరకు ఇందులో 509 మంది వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఈపీడీసీఎల్‌ పరిధిలోకి వచ్చాక ఎలాంటి నియామకం చేయాలన్నా డిస్కం అనుమతులు ఉండాలి. దీన్ని పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు కొందరు తమకు తెలిసిన వారి దగ్గర రూ. లక్షలు వసూలు చేసి ఒప్పంద సిబ్బందిగా నియమించినట్లు ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్‌ను పక్కన పెట్టి వీరికి జూన్‌, జులైల్లో జీతాలు కూడా చెల్లించినట్లు తెలిసింది. ఇటీవల ఈఆర్సీ ఆదేశాల మేరకు రెస్కో చేసిన రూ.5.13 కోట్ల అనధికార ఖర్చుపై విచారణ చేపట్టినప్పుడు 33 మందిని అనధికారికంగా నియమించుకున్నట్లు వెలుగుచూసింది. దీంతో వారికి ఈ నెల జీతాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయితే ఒకటి, రెండు నెలల్లో రెస్కో తిరిగి సహకార శాఖ పరిధిలోకి వచ్చేస్తుందని నేతలు నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జీతాలివ్వకపోయినా తర్వాత బకాయిలతో కలిపి ఇస్తామని, ఎవరూ బయటపడవద్దని సొమ్ములు వసూళ్లు చేసిన నేతలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా చాలామందికి విద్యార్హత లేకపోయినా సొమ్ములిస్తే పదోన్నతులిచ్చేశారు.. ఇంజినీరింగ్‌ అధికారులుగానూ నియమించిన దాఖలాలూ ఉన్నాయి. ఈ అక్రమాలపై ఇదివరకే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

* ఈపీడీసీఎల్‌లో విలీనం చేస్తే ఇలాంటి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయనే రెస్కోని సహకార రంగంలో కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా లైసెన్స్‌ పునరుద్ధరణ జరిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెస్కో ఎండీ కృష్ణంరాజు పదవీ కాలం కూడా గతేడాది డిసెంబర్‌తోనే ముగిసిపోయింది. మాతృశాఖ నుంచి పొడిగింపు ఉత్తర్వులు లేకుండానే ఇక్కడ కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు అనధికారికంగా తీసుకున్న జీతం సొమ్ములు కూడా రికవరీ చేశారు. ఈ విషయమై రెస్కో వ్యవహారాలు చూస్తున్న ఈపీడీసీఎల్‌ ఈఈ రాజశేఖర్‌ వద్ద ప్రస్తావించగా అనధికారికంగా నియమించుకున్నట్లు గుర్తించిన వారికి జీతాలు ఆపేశామని స్పష్టం చేశారు. వారి నియామకాలను నిరూపించుకోవాలని సూచించామన్నారు. సరైన పత్రాలను సమర్పించలేకపోయారని, వారికి ఇదివరకు జీతాలు ఇచ్చుంటే వాటినీ రికవరీ చేస్తామని చెప్పారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని