మిస్టరీగా దంపతుల హత్య కేసు

జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరి నగర్‌లో సోమవారం జరిగిన దంపతుల హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. పలువురు అనుమానితులను విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం వెస్ట్‌ జోన్‌ ఏసీపీ పెంటారావు, పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది

Published : 10 Aug 2022 05:35 IST

కొనసాగుతున్న దర్యాప్తు

సంఘటన ప్రాంతంలో పరిశీలిస్తున్న ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్‌కుమార్‌

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరి నగర్‌లో సోమవారం జరిగిన దంపతుల హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. పలువురు అనుమానితులను విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం వెస్ట్‌ జోన్‌ ఏసీపీ పెంటారావు, పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది సంఘటన ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు. సమీప రహదారుల్లో ఇళ్లు, దుకాణాలు వంటి ప్రదేశాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఆధారాలు లభిస్తాయా అన్న కోణంలో శోధిస్తున్నారు. అసలు హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఉద్దేశ పూర్వకంగా చేశారా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? అన్న విషయాలపై సందిగ్ధత నెలకొంది.

ఆ ఘటన తరహాలోనే: పెందుర్తిలో నెల రోజుల క్రితం జరిగిన ఘటన సోమవారం నాటి ఘటనను పోలి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత నెల 9న విజయనగరం జిల్లా బొబ్బిలి దరి ఎ.వెలగవలస గ్రామానికి చెందిన తల్లీ కుమారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ ఘటనలో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకున్నారు. వారు కూడా పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో కాపలాదారులుగా పనిచేయడం గమనార్హం. సరిగ్గా నెల రోజుల తర్వాత తాజా ఘటన అదే తరహాలో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని