logo

కదిలిన క్రికెట్‌ బెట్టింగ్‌ డొంక

జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ నడిపిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి కేంద్రంగా బెట్టింగ్‌ వ్యవహారం జోరుగా సాగుతోందని పోలీసుల వద్ద ఎప్పటినుంచో సమాచారం ఉంది. దీనికితోడు ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందనకి వస్తున్న ఫిర్యాదుల్లో భూ వ్యవహారాలు

Updated : 10 Aug 2022 06:47 IST

నలుగురు బుకీల అరెస్ట్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ నడిపిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి కేంద్రంగా బెట్టింగ్‌ వ్యవహారం జోరుగా సాగుతోందని పోలీసుల వద్ద ఎప్పటినుంచో సమాచారం ఉంది. దీనికితోడు ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందనకి వస్తున్న ఫిర్యాదుల్లో భూ వ్యవహారాలు ఎక్కువగా ఉండటం, ఇందులోనూ ముఖ్యంగా బెట్టింగ్‌ల బకాయిలకు సంబంధించి బలవంతంగా భూముల రాయించుకున్న సందర్భాలు ఉంటున్నాయని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనకాపల్లి కేంద్రంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతోందని, ఇది జిల్లాలో పలుచోట్లకు విస్తరించిందని నిర్థారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీనగరానికి చెందిన జి.ప్రవీణ్‌కుమార్‌ తాను క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్న నగదుకు సంబంధించి వేధింపులు ఎక్కువ అవుతున్నాయంటూ గతనెలలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు మేరకు అనకాపల్లి గవరపాలెంకి చెందిన భీశెట్టి హిమసాగర్‌, బుద్ద బాలాజీ, యల్లపు చక్రవర్తిలను అరెస్ట్‌ చేశారు. నిందితుల కాల్‌డేటా ఆధారంగా మరో నలుగురిని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వీరు బెట్టింగ్‌లో బుకీలుగా వ్యవహరిస్తూ పాల్గొన్నవారికి అప్పులు ఇప్పించి బలవంతంగా వారి ఆస్తులు రాయించుకుంటున్నారని తమ విచారణలో తేలిందని పట్టణ సీఐ దాడి మోహనరావు తెలిపారు. నిందితులు బుద్ద మహలక్ష్మినాయుడు, కొణతాల హిమ గణేష్‌, మళ్ల ఉషాసాగర్‌, పి.అశోక్‌లను కోర్టుకు తరలించారు.


తెరవెనుక ఉన్నవారిపై ఆరా

ఈ బెట్టింగ్‌ వ్యవహారంలో తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు, ఆస్తులు పోగొట్టుకున్న వారు చాలామందే ఉంటున్నా ఇప్పటివరకు ఒక్క యువకుడు మాత్రమే ఫిర్యాదు చేశారు. బాధితుల్లో మిగిలినవారు మరిన్ని వివరాలు అందిస్తే బెట్టింగ్‌ని పూర్తిగా అరికట్టేందుకు వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు.

సమగ్రంగా విచారణ: క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుంది. గాంధీనగరానికి చెందిన యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్‌ చేశాం. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. బెట్టింగ్‌ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ విడిచి పెట్టేది లేదు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. బెట్టింగ్‌ని అరికట్టేందుకు అంతా సహకరించాలి.

- దాడి మోహనరావు, అనకాపల్లి పట్టణ సీఐ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని