logo

స్వాతంత్య్ర ఉద్యమంలో అనకాపల్లి

అనకాపల్లి జిల్లాకు చెందిన ఎంతో మంది త్యాగమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బానిసత్వ సంకెళ్లు తెంచేందుకు తమ వంతు పోరాటం చేశారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే లక్ష్యంతో ఉద్యమాలు చేసి కారాగారాల్లో నెలల తరబడి మగ్గిపోయారు. స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం,

Published : 10 Aug 2022 05:35 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే

అనకాపల్లి జిల్లాకు చెందిన ఎంతో మంది త్యాగమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బానిసత్వ సంకెళ్లు తెంచేందుకు తమ వంతు పోరాటం చేశారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే లక్ష్యంతో ఉద్యమాలు చేసి కారాగారాల్లో నెలల తరబడి మగ్గిపోయారు. స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్‌ ఇండియా పోరాటంలో అనకాపల్లికి చెందినవారు పాలుపంచుకున్నారు.

* ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీ పిలుపునందుకొని పట్టణానికి చెందిన డాక్టరు గుళ్లపల్లి నారాయణమూర్తి, గాంధేయవాధి కోరుకొండ బుచ్చిరాజు ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. దీంతో బ్రిటిష్‌ పాలకులు బుచ్చిరాజును 1930 మే 29న అరెస్టు చేసి బరంపురం, బళ్లారి జైళ్లలో ఏడాది ఉంచారు. నారాయణమూర్తిని ఆకేపురం, బళ్లారి జైళ్లలో ఆరునెలలు ఉంచారు.

శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న కొడుకుల సూర్యనారాయణను 1932 ఫిబ్రవరి 19న అరెస్టు చేసి మద్రాసు జైలులో ఉంచారు. 1941 మార్చి 15న మరోసారి అరెస్టు చేసి అల్లిపురం జైలులో ఎనిమిది నెలలు ఉంచారు. ఆయన కుమారులు కొడుకుల సోమన్న, జోగారావు సైతం తండ్రి బాటలో నడిచారు. బ్రిటిష్‌ వారిని ఎదిరించినందుకు వారిని తిరుచురాపల్లి, ఆలీపూర్‌ జైలులో ఉంచారు. గాంధీ పిలుపునందుకొని 1941 జనవరి 31న మాజీ ఎంపీ మిస్సుల సూర్యనారాయణ తన స్వగ్రామమైన కొండకర్లలో సత్యాగ్రహం చేపట్టారు. శాసనోల్లంఘనకు పాల్పడ్డారని అరెస్టు చేసి బళ్లారి వద్ద ఉన్న అల్లిపురం క్యాంపు జైలులో తొమ్మిది నెలలు ఉంచారు. వంద రూపాయిలు జరిమానా విధించారు.

1942లో నిర్వహించిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో జక్కినపల్లి శ్రీరామమ్మూర్తి, కోరిబిల్లి జోగారావు పాల్గొని బళ్లారి వద్ద ఉన్న అల్లిపురం జైలులో శిక్ష అనుభవించారు. మాజీ ఎమ్మెల్యేలు కె.గోవిందరావు, భీశెట్టి అప్పారావు, స్థానిక ఉద్యమకారుడు కందిరిశెట్టి సుబ్బారావు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11 నెలలు పాట్నా జైలులో శిక్ష అనుభవించారు. కొడుకుల కామేశ్వరమ్మ నెల్లూరు జైలులో మూడునెల జైలు శిక్ష అనుభవించారు. మున్సిపల్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.

కశింకోట ఆర్‌ఈసీఎస్‌ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే పి.వి.రమణ సైతం స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. పోలీసుల దాడి నుంచి పలు పర్యాయాలు తప్పించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని