logo

ఆదివాసీ చట్టాల పరిరక్షణకు కృషి

ఆదివాసీ తెగల హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి చేస్తానని విశాఖ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శ్రమశక్తినగర్‌లోని పోర్టు కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి

Published : 10 Aug 2022 05:35 IST

జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర

మాట్లాడుతున్న జెడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ఆదివాసీ తెగల హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి చేస్తానని విశాఖ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శ్రమశక్తినగర్‌లోని పోర్టు కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెందుర్తి ప్రాంత గిరిజన ఉద్యోగులు ఐక్యంగా ఏర్పాటు చేసిన వేడుకలను అభినందించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో భాగంగా సంఘం అధ్యక్షుడు లకే చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి శతక చిట్టయ్య, సంఘం పెద్దలు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. గిరిజన మహిళలకు గిరిజన సంప్రదాయ వంటకాల పోటీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు పెందుర్తి ఎంపీడీవో కార్యాలయం దరి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి శ్రమశక్తినగర్‌ పోర్టు కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి హెచ్‌.లజపతిరాయ్‌, సంఘం ఉపాధ్యక్షుడు అంబిడి రాజయ్య, కోశాధికారి తలారి జానకిరావు, గౌరవాధ్యక్షుడు బాకురు కరుణాకర్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పొత్తూరు మల్లేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇతరులకు భూమి ఇచ్చే హక్కు లేదు: గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు అంగుళం భూమి కూడా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని గిరి జాగృతి సంస్థ అధ్యక్షుడు మోరి సింహాచలం అన్నారు. పెందుర్తిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. గిరిజనేతరులకు గిరి ప్రాంతాల్లో సెంటున్నర భూమి జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తక్షణమే ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే జరిగితే జీవో సంఖ్య 3 తరహాలో ఆదివాసీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. ఈ విషయంపై జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ గిరిజనేతరులకు సెంటున్నర భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఇతర మంత్రులు సీఎంను కలవడం జరిగిందన్నారు. అలాంటి ప్రతిపాదనను రద్దు చేయాలని కోరినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని