logo

అంకుర సంస్థతో అద్భుత విజయం

ఇద్దరితో ఎనిమిదేళ్ల క్రితం ఆరంభమైన ఓ చిన్న అంకుర సంస్థ నేడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించే దిశగా ప్రస్థానం కొనసాగిస్తోంది. విశాఖలోని ఇన్నోవేషన్‌ వ్యాలీ నుంచి విజయపథం వైపు వెళుతూ ప్రశంసలు అందుకుంటోంది. అతికొద్ది పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ టర్నోవర్‌ ప్రస్తుతం రూ.5 కోట్లు దాటింది

Updated : 12 Aug 2022 06:38 IST

ఇన్నోవేషన్‌ వ్యాలీ నుంచి అంతర్జాతీయ స్థాయికి 
ఈనాడు, విశాఖపట్నం

ఇద్దరితో ఎనిమిదేళ్ల క్రితం ఆరంభమైన ఓ చిన్న అంకుర సంస్థ నేడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించే దిశగా ప్రస్థానం కొనసాగిస్తోంది. విశాఖలోని ఇన్నోవేషన్‌ వ్యాలీ నుంచి విజయపథం వైపు వెళుతూ ప్రశంసలు అందుకుంటోంది. అతికొద్ది పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ టర్నోవర్‌ ప్రస్తుతం రూ.5 కోట్లు దాటింది. ఆసక్తి... నిరంతర శ్రమ వల్లే ఈ ఫలితమని సంస్థ వ్యవస్థాపకుడు జి.ప్రసాద్‌బాబు పేర్కొంటున్నారు.

ఏలూరు జిల్లా చాట్రాయి గ్రామానికి చెందిన ప్రసాద్‌బాబు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అప్లైడ్‌ జియాలజీలో ఎమ్మెస్సీ టెక్‌ కోర్సు చేశారు. ఆ తరువాత ఐ.ఐ.టి. కాన్పూర్‌లో జియో ఇన్ఫర్మేటిక్స్‌, స్పేసియల్‌ డేటా ఎనాలసిస్‌ అంశాలతో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. చదువులో ప్రతిభ చూపిన ఇతనికి అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు దక్కాయి. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక ఆసక్తి ఉన్న తనకు...అందుకు తగ్గ ఉద్యోగానికి ప్రయత్నించి సఫలమయ్యారు. 
పర్యావరణానికి సంబంధించిన అధ్యయనాలు, విపత్తుల నష్టాలను తగ్గించుకునే మార్గాలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పరిష్కారాలను అందిపుచ్చుకోవాలి? తదితర అంశాలపై లోతైన అధ్యయనం సాగించి పట్టు పెంచుకున్నారు. భూటాన్‌ దేశంతోపాటు దిల్లీలోని ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’(యు.ఎన్‌.డి.పి.)లో విధులు నిర్వర్తించారు. పలు సంస్థల్లో మొత్తం 14 ఏళ్లపాటు ఉద్యోగాలు చేశారు.
2014లో విశాఖపట్నంలో..   ‘జియో క్లైమేట్‌ రిస్క్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’(జి.సి.ఆర్‌.ఎస్‌.) పేరుతో సొంతంగా ఒక అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. తరువాత ఐ.టి.హిల్స్‌లోని ఇన్నోవేషన్‌ వ్యాలీలో మరింత అభివృద్ధి చేశారు. తనకున్న అనుభవం, పరిచయాలతో ప్రాజెక్టులు సాధించారు. ట్రాక్‌  రికార్డును పరిశీలించిన ఆదిత్య బిర్లా గ్రూపు, టాటా స్టీల్‌, జె.ఎస్‌.డబ్ల్యు., ఐ.ఒ.సి.ఎల్‌., గెయిల్‌, యు.ఎన్‌.డి.పి., ఎ.ఎఫ్‌.డి. అనే ఫ్రాన్స్‌ దేశ సంస్థ, వరల్డ్‌ బ్యాంక్‌...ఇలా ఎన్నో రూపాల్లో ప్రాజెక్టులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలోని చెరువులు, నీటివనరుల పునరుద్ధరణకు వీలుగా జి.సి.ఆర్‌.ఎస్‌.తో అధ్యయనం చేయించింది. ఉత్తరాఖండ్‌, అసోమ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాల ప్రాజెక్టులనూ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవల తజికిస్థాన్‌ ప్రభుత్వం ఆ దేశంలోని ఖొరోగ్‌ నగరంలో విపత్తుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేసే బాధ్యతను ఆ దేశ సంస్థతో సంయుక్తంగా నిర్వహించేలా ఓ ప్రాజెక్టును అప్పగించింది.
గెయిల్‌ పెట్టుబడి.. జి.సి.ఆర్‌.ఎస్‌. సంస్థలో ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌ రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టింది. చమురు, సహజవాయువు పైపులైను వ్యవస్థలు అత్యంత సురక్షితంగా ఉండడానికి, ఆయా వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ముప్పు అవకాశాలను సమర్థంగా విశ్లేషించడానికి అవసరమైన పరిజ్ఞానాలను కూడా జి.సి.ఆర్‌.ఎస్‌. అభివృద్ధి చేయడం విశేషం. కేంద్ర, భూగర్భజల అథారిటీ (సి.జి.డబ్ల్యు.ఎ.) అధికారులు మైనింగ్‌, మౌలికసదుపాయాలు, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రాంతాల్లో భూగర్భజలాలపై ప్రభావం, పరిష్కార మార్గాలు, హైడ్రో జియోలాజికల్‌ అధ్యయనాలకు గుర్తింపు పొందిన ఏజెన్సీగా ‘జి.సి.ఆర్‌.ఎస్‌.’కు పేరొచ్చింది. పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణపై అధునాతన వ్యవస్థల అభివృద్ధికి కాన్పూర్‌ ఐ.ఐ.టి.లో ఒక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు సాంకేతిక నిపుణులు అంతర్జాతీయంగా వచ్చే సరికొత్త పరిజ్ఞానాలను పరిశీలించి తమ వ్యవస్థలను నవీకరిస్తారు.


పర్యావరణంపై మమకారమే నిలబెట్టింది..
పర్యావరణంపై నాకున్న మమకారమే నన్ను పారిశ్రామికవేత్తగా నిలబెట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పర్యావరణానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి కొందరు నిపుణులను ఆహ్వానించగా... ‘సంక్షోభ నిర్వహణ’(క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌) విభాగంలో నేను ఎంపికయ్యాను. అమెరికాలో ఉపయోగిస్తున్న పరిజ్ఞానాలను కూడా మూడు వారాలపాటు మాకు వివరించారు. 
-జి.ప్రసాద్‌బాబు, వ్యవస్థాపకుడు, జి.సి.ఆర్‌.ఎస్‌. విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని