logo

రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు..

రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు.. లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని బయల్దేరిన మహిళ కుమారుడితో సహా మృత్యుఒడికి చేరింది. దుడ్డుపాలెం గ్రామ సమీపాన గురువారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన జరిగింది

Published : 12 Aug 2022 06:01 IST

లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం

భార్య సత్యవతి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త రాంబాబు

రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు.. లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని బయల్దేరిన మహిళ కుమారుడితో సహా మృత్యుఒడికి చేరింది. దుడ్డుపాలెం గ్రామ సమీపాన గురువారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీ కొడుకులను లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది.

ఎస్సై విభీషణరావు కథనం ప్రకారం.. సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పెద్దయాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (35)కి భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె కుందన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుమారుడు సుఖీష్‌రామ్‌ విశాఖలో ఇంటర్‌ పూర్తి చేశాడు. మరో రెండు   రోజుల్లో చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేర్చాలనుకున్నారు. సత్యవతి పుట్టిల్లు మునగపాక. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు బొడేటి అప్పలనాయుడు, జగ్గారావు, ఈశ్వరరావు ఉన్నారు. మునగపాకలో ఈమె వాటాగా వచ్చిన రెండెకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఊడుపుల నిమిత్తం కుమారుడు సుఖీష్‌రామ్‌ (19)తో బైక్‌పై సత్యవతి పుట్టింటికి గురువారం తెల్లవారుజామునే బయలుదేరారు. వ్యవసాయ పనులు చూసుకొని శుక్రవారం సోదరులు ముగ్గురికి రాఖీ కట్టి వస్తానని భర్తకు, బంధువులకు చెప్పింది. మరికొద్దిసేపట్లో వెంకన్నపాలెం జంక్షన్‌లో ఆగి టిఫిన్‌ చేద్దామని తల్లీ,కుమారుడు అనుకున్నారు.
*  దుడ్డుపాలెం జంక్షన్‌ సమీపానికి వచ్చేసరికి వెంకన్నపాలెం నుంచి నర్సాపురం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్తున్న లారీ ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చి వీరి బైకును ఢీకొంది.  వీరిద్దరిని కొంతదూరం ఈడ్చుకు పోయింది. గాయపడి కొనఊపిరితో ఉన్న వారిని వదిలేసి లారీ డ్రైవర్‌ రమణ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ కింద ఉన్న సుఖీష్‌రామ్‌ను బయటకు లాగారు. లారీ అతడి మెడపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటికే తల్లితోపాటు కుమారుడు ప్రాణాలు విడిచారు. భార్యాబిడ్డా ఒకేసారి దూరమయ్యారంటూ సత్యవతి భర్త రాంబాబు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
*     పెదయాతపాలెంలో విషాదఛాయలు: మృతిచెందిన తల్లి, కుమారుడి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం సాయంత్రం పెదయాతపాలెం తీసుకురావడంతో మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధువులు పెద్ద  ఎత్తున చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని