logo

ముద్ర పడలేదా.. డొక్క మాడిందే!

సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ కష్టాలు తీరడం లేదు. ఇవి ఇప్పుడు విద్యార్థుల భోజనాలపై ప్రభావం చూపుతున్నాయి. వేలిముద్రల నమోదు ఆధారంగానే వీరికి అందించే ఆహారానికి ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తోంది. పాత పరికరాలకు తోడు కొందరికి వేలిముద్రలు

Published : 12 Aug 2022 06:36 IST

 వసతి గృహాల్లో విద్యార్థులకు అవస్థలు
బయోమెట్రిక్‌ హాజరుతో చెల్లింపులకు ముడి

వసతిగృహంలో విద్యార్థుల భోజనాలు

సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ కష్టాలు తీరడం లేదు. ఇవి ఇప్పుడు విద్యార్థుల భోజనాలపై ప్రభావం చూపుతున్నాయి. వేలిముద్రల నమోదు ఆధారంగానే వీరికి అందించే ఆహారానికి ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తోంది. పాత పరికరాలకు తోడు కొందరికి వేలిముద్రలు పడకపోవడంతో హాస్టళ్లలో చాలామందికి బయోమెట్రిక్‌ నమోదు కావడం లేదు. ఇలాంటి వారిని ఇంటికి పంపించలేక భోజనాల పెడుతున్న పరిస్థితి. ఇది కొన్నిచోట్ల లెక్కల్లో తేడాలకు దారితీస్తోంది.
ఎస్సీ వసతిగృహాల్లో చాల కాలం నుంచి పారదర్శకత కోసం బయోమెట్రిక్‌ విధానం అమలుచేస్తున్నారు. వేలిముద్ర నమోదైన విద్యార్థికి మాత్రమే ప్రభుత్వం నుంచి భోజనం సొమ్ము జమ అవుతోంది. వేలిముద్రలు పడని విద్యార్థులు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగక తప్పడం లేదు. సాంకేతిక సమస్యలతోనూ పరికరాలు ఒక్కోసారి మొరాయిస్తున్నాయి. వీటి వల్ల బయోమెట్రిక్‌కు నోచుకోని వారిని ఇళ్లకు పంపించేయలేక భోజనాలకు అనుమతిస్తున్నారు. దీంతో ఇప్పుడు విద్యార్థులు అర్ధాకలితో సతమతమవుతున్నారు. కాలం చెల్లిన ల్యాప్‌ట్యాప్‌లు, డివైజ్‌లు వల్ల ఒక రోజు వేలిముద్ర పడిన విద్యార్థికి మర్నాడు పడడం లేదు. కొంతమందికి వేలిముద్రలు అరిగిపోవడంతో వారంతా నిత్యం ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.


2018లోని ధరలే ఇప్పటికీ అమలు
వేలిముద్రల బాధలకు తోడు ఆహార పదార్థాలకు చెల్లిస్తున్న ధరలతోనూ విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. హాస్టల్‌లోని ఒక విద్యార్థికి రోజుకు రూ.41.66 పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. 2018 సంవత్సరం నుంచి ఈ రేట్లనే అమలుచేస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులు అప్పటి ధరలతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పెరిగిపోయాయి. దీనికి తోడు డబ్బులు రావని తెలిసి భోజనాలు పెట్టాల్సి వచ్చి హెచ్‌డబ్ల్యూఓలు అవస్థలు పడుతున్నారు. కొందరు బాధను దిగమింగుకుంటూ చెడ్డపేరు రాకుండా చేతి చమురు వదిలించుకొని హాజరైన వారందరికీ భోజనాలు సమకూరుస్తున్నారు. కొందరు ఉన్న ఆహార పదార్ధాలనే సర్దుబాటు చేస్తున్నారు. దీని వల్ల వంటకాల్లో నాణ్యత, రాశి లోపిస్తోంది. కొన్ని చోట్ల ఒక కూర, పెరుగుతో సరిపెడుతున్నారు.

20% మందికి నమోదు కావడం లేదు
ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇతర సంక్షేమ శాఖల్లో సాధారణ పద్ధతిలోనే విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖలోని బయోమెట్రిక్‌ విధానం మాత్రం హెచ్‌డబ్ల్యూఓలు కొందరు అవకతవకలకు పాల్పడేందుకు అవకాశం ఇస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త పరికరాలు సమకూర్చి అందరి బయోమెట్రిక్‌ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటే అవినీతికి ఆస్కారం ఉండదంటున్నారు.

ప్రభుత్వ పరిశీలనలో ఉంది
సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్‌ల్లో బయోమెట్రిక్‌ సమస్య వాస్తవమే. వేలిముద్రలు పడని వారిని బయటకు పంపలేం. అయినా విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. 2018లోని మెనూ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను మా శాఖ డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాం, కలెక్టర్‌కు నివేదించాం. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్మార్ట్‌ చరవాణిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వేలిముద్రలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేశాం. హెచ్‌డబ్ల్యూఓలు కొందరికి వీటిని వినియోగించడం తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నారు. - రమణమూర్తి, నోడల్‌ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ
ఉమ్మడి విశాఖ జిల్లాలో
ఎస్సీ వసతి గృహాలన్నీ కలిపి 55 వరకు ఉన్నాయి. వీటిలో ఉన్న 6,500 విద్యారుల్లో ప్రస్తుతం సుమారు 20 శాతం మందికి రోజూ బయోమెట్రిక్‌ నమోదు కావడం లేదు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని