Agnipath: విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్‌ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు

సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. విశాఖలోని

Updated : 12 Aug 2022 19:41 IST

విశాఖ: సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలకు నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. 14 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాలు, యానాంకు చెందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆర్మీ నియామక ర్యాలీ కోసం దాదాపు 60వేల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రిక్రూట్‌ మెంట్‌ ద్వారా  అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(పది పాసైనవారు), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(8 పాసైనవారు)ని ఎంపిక చేస్తామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటకే అడ్మిట్‌ కార్డులు కూడా  జారీ అయ్యాయి.www.joinindianarmy.nic.in అంతర్జాల చిరునామా నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి మొబైల్‌యాప్‌ 'army calling' ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అందులో అభ్యర్థులకు ‘లైవ్‌ చాట్‌’ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. విశాఖలోని రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం నంబర్లు 0891- 2756959, 2754680లకు ఫోన్‌ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.

ర్యాలీ నిర్వహించేందుకు రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు...

రాష్ట్ర నలుమూలల నుంచి అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనేందుకు అవకాశం ఉండటంతో స్టేడియంను పూర్తిగా ఆర్మీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసరాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. విశాఖ జిల్లా యంత్రాంగం, మహానగరపాలక సంస్థ, నగర పోలీసులు ఆర్మీ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ర్యాలీ ఏర్పట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వర్షం కారణంగా  ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇబ్బందులు తలెత్తితో బీచ్‌ రోడ్‌లో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పట్లు చేశామన్నారు. రెండు ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

స్టేడియం బురదమయం

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వేదికైన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం బురదమయంగా మారింది. అభ్యర్థులు బారికేడ్ల మధ్యలోని ట్రాక్‌లోనే పరుగు తీయాలి. వర్షం కారణంగా మైదానంలో చాలా ప్రాంతాలు బురదగా మారాయి. 14వ తేదీ నాటికి బురద ఇలాగే ఉంటే పరుగు తీసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మైదానం బయట జవాన్లకు కేటాయించిన గదుల వద్ద ఉన్న బురదను వారే స్వయంగా తొలగించుకుంటున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి మైదానంలోని ట్రాక్‌ను సరి చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని