logo
Published : 15 Aug 2022 04:23 IST

అలల ఉగ్రరూపం

కలవరపెడుతున్న తీరంలో కోత

ఈనాడు, విశాఖపట్నం

యోగా విలేజ్‌ ఎదురుగా దెబ్బతిన్న కొబ్బరి తోటల ప్రాంతం 

పర్యాటకుల రాకతో నిత్యం సందడిగా కనిపించే విశాఖ తీరంలో ‘కోత’ల గండం కలవరపెడుతోంది. ఇది రోజురోజుకు ఉద్ధృతం కావడం గమనార్హం. విశాఖ వాసులు, నగరానికి వచ్చే సందర్శకుల్లో ఎక్కువ మంది ఆర్‌కే బీచ్‌కే మొగ్గు చూపుతారు. ఇక్కడి తీరంలోని అందాలు...అనుకూల వాతావరణం అందరినీ రారమ్మంటూ పిలుస్తుంటాయి. ఆర్‌.కె.బీచ్‌ నుంచి వై.ఎం.సి.ఎ. వరకు సుమారు రెండు కి.మీ.ల మేర జన సందడి నెలకొంటుంది.

2015లో అలల ఉద్ధృతికి బీచ్‌ రోడ్డులోని రక్షణ గోడ ఏకంగా 18 మీటర్ల పొడవున కూలిపోయింది. రోడ్డు కూడా దెబ్బతింది. అధికారులు యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించారు. గ్రావెల్‌, రాళ్లు వేసి తాత్కాలికంగా తీరం కోతకు గురికాకుండా అప్రమత్తమయ్యారు. తీరంలోనే ఉన్న చిన్నపిల్లల ఉద్యానవనం గోడ కూడా ఓసారి కూలింది. తీరం కోతకు గురయ్యే పరిస్థితులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై పలు రకాల అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఏయూ, ఎన్‌.ఐ.ఒ.టి.(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ), డెల్టారెస్‌ అనే విదేశీ సంస్థ దీనిపై కసరత్తు చేస్తున్నా అవీ కొలిక్కిరాలేదు. అయితే...విశాఖ తీరం కోతకు గురికాకుండా చేపట్టే చర్యలకు మాత్రం రూ.120కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ మొత్తం ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు అధికారులు కూడా ముందుకు వచ్చారు. శాస్త్రీయమైన అంశాలతో సమగ్ర పథక నివేదిక(డి.పి.ఆర్‌.) తయారు చేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమాలూ ముందుకు సాగటం లేదు.

సరిపోని ఇసుక: జీవీఎంసీ అనుమతితో ఐదు చోట్ల ‘సన్‌రే రిసార్ట్స్‌’ నిర్వాహకులు కొబ్బరితోటలను అభివృద్ధి చేశారు. రూ.80లక్షల వ్యయంతో ఆ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. నౌకాశ్రయ అధికారులు సముద్రంలో పోగుపడ్డ ఇసుక మేటలను తవ్వోడ (డ్రెడ్జర్‌)ల సాయంతో ‘తీరవృద్ధి’ కార్యక్రమం పేరిట టన్నుల కొద్దీ తీరంలో పోస్తున్నారు. అదీ సరిపోకపోవడంతో కోత ఆగడం లేదు.

ఈ విధానంలోనైనా...

గాల్వనైజ్డ్‌ తీగలతో నిర్ణీత పొడవు మేరకు పెట్టెలా తయారు చేసి అందులో రాళ్లు వేస్తారు. దాన్ని తీరంలో కోత ఎక్కువగా ఉన్నచోట్ల ఉంచుతారు. అలలు వాటిని ఢీకొట్టినప్పుడు తీవ్రత, వేగం తగ్గుతుంది. అలలతోపాటు కొట్టుకువచ్చే ఇసుక వెనక్కి వెళ్లడమూ తగ్గుతుంది. ‘గాబ్రియల్‌ వాల్‌’గా పేర్కొనే ఈ విధాన కార్యాచరణ తక్షణం అమలు చేస్తే కోత ముప్పు కొంతైనా తగ్గుతుందని పలువురు సూచిస్తున్నారు.

బీచ్‌లో పెంచుతున్న కొబ్బరి చెట్లు: 650 (సుమారు)

గత 50 రోజుల్లో కూలినవి: 16

కూలడానికి సిద్ధంగా ఉన్నవి: 50

ప్రాంతాలు: 5

విశాఖ-భీమిలి తీర రహదారి పొడవు: 30కి.మీ.లు

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని