logo

‘హయగ్రీవ’లో... పెద్దలకు విల్లాలు

విశాఖలోని ‘హయగ్రీవ’ స్థలాల వ్యవహారాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయి అనుమతి రావాల్సి ఉన్నా... ఆలోపే అక్కడ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  

Published : 18 Aug 2022 04:40 IST
విజిలెన్స్‌ అధికారుల ఆరా
-ఈనాడు, విశాఖపట్నం

విశాఖలోని ‘హయగ్రీవ’ స్థలాల వ్యవహారాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయి అనుమతి రావాల్సి ఉన్నా... ఆలోపే అక్కడ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  

ఆయా భూ కేటాయింపులు, ప్రభుత్వానికి కలెక్టర్‌ రాసిన లేఖ, ఇతర అంశాలపై నిఘా వర్గాలు కన్నేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రస్తుత, మాజీ నేతలు అందులోని విల్లాల స్థలాలు కొనుగోలు చేయగా తాజా పరిణామాలు వారిలో కలవరం రేపుతున్నాయి. ఎండాడ వద్ద సర్వే నంబరు 92-3లో 12.51 ఎకరాలను హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌కు కేటాయించగా ఆ స్థలంలో వయసు మీరిన వారికి కాటేజీలు, పది శాతం స్థలంలో మొదట వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం ఉచితంగా నిర్మించాలి. జీవితాంతం వాటి నిర్వహణ బాధ్యత ఆ సంస్థే చూడాలి. భవన నిర్మాణాలకు అనువుగా 5.99 ఎకరాలు అందుబాటులో ఉన్నా వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మించకపోవడాన్ని తప్పిదంగా గతంలో ప్రభుత్వానికి కలెక్టర్‌ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనల్లో పేర్కొన్నవి చేయకుండానే పలువురికి రిజిస్ట్రేషన్‌ చేశారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఆ సర్వే నంబరుపై 55 రిజిస్ట్రేషన్లు జరగ్గా అందులో పలువురు ‘పెద్దలకు’ ప్లాట్లు ఉండడం గమనార్హం. అందులో అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎంపీ, నగరానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నట్లు సమాచారం. వీరే కాకుండా బంధువులు, కుటుంబ సభ్యులు ఇతరుల పేరున మరికొందరు ప్రముఖులకు విక్రయించినట్లు సమాచారం.

* జీవీఎంసీకు సమర్పించిన ఆకృతులు వృద్ధుల నిర్మాణాలకు వీలుగా లేవు. ర్యాంపులు, ఇతర నిర్మాణాలు ఎక్కడా కనిపించలేదు. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా ఉన్నాయి. లేఅవుట్‌, భవన నిర్మాణ అనుమతి రాకుండానే ప్లాట్లు విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని