logo

బంగారు గొలుసు కోసమే ఆమెను చంపేశాడు!

మూడుతులాల బంగారు గొలుసు దక్కించుకోవాలన్న అత్యాశతో ఓ యువకుడు వివాహిత నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పాముల భారతి (38)

Published : 24 Sep 2022 03:31 IST

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: మూడుతులాల బంగారు గొలుసు దక్కించుకోవాలన్న అత్యాశతో ఓ యువకుడు వివాహిత నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పాముల భారతి (38) గురువారం పొలంలో దారుణంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు ఒక్కరోజులోనే పట్టుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆ వివరాలివీ. వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పాముల వెంకటేష్‌ భార్య భారతి గోవాడలో ఉన్న పొలానికి గురువారం ఒంటరిగా వెళ్లింది. వారుండే వీధిలోనే నివాసం ఉంటున్న జమ్మాల గంగాధర్‌ ఇది గమనించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు ఇవ్వాలని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో నిందితుడు లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీనిని వివాహిత ప్రతిఘటించింది. ఆ సమయంలో నిందితుడు పొలంలో గడ్డి కోసే కొడవలితో మెడ భాగంలో కోసి హత్య చేశాడు. అనంతరం మెడలో ఉన్న గొలుసుతోపాటు చెవిదిద్దులు పట్టుకొని వెళ్లిపోయాడు. భర్త వెంకటేష్‌ సాయంత్రం పొలంలోకి వచ్చి చూసేసరికి భార్య హత్యకు గురైందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ గౌతమీ సాలి ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ తాతారావు, ఎస్సై యమున, సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారని డీఎస్పీ తెలిపారు. నిందితుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, తానే భారతిని హత్య చేశానని అంగీకరించాడన్నారు. అతడి వద్ద ఉన్న బంగారం వస్తువులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. సీఐలు తాతారావు, శ్రీనివాసరావు, ఎస్సై యమున, బుచ్చెయ్యపేట ఎస్సై కుమార్‌స్వామి సహకారంతో అతి తక్కువ సమయంలో హత్య కేసును ఛేదించామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని