logo

5,600 మందికి ఇళ్లు మంజూరు: బూడి

పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే జగనన్న చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆన్నారు. శనివారం మాడుగుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో సర్పంచి కళావతి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న చేయూత పథకం కింద నమూనా చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.

Published : 25 Sep 2022 05:21 IST

చెక్కు పంపిణీ చేస్తున్న బూడి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి, కలెక్టరు రవి

మాడుగుల, న్యూస్‌టుడే: పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే జగనన్న చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆన్నారు. శనివారం మాడుగుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో సర్పంచి కళావతి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న చేయూత పథకం కింద నమూనా చెక్కును లబ్ధిదారులకు అందచేశారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు వద్ద చేయూత పథకం ప్రకటించిన విషయాన్ని శుక్రవారం కుప్పంలో సీఎం గుర్తుచేసుకున్నారని  ముత్యాలనాయుడు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకమైనా అందకపోతే ఆందోళన చెందొద్దన్నారు. వాలంటీర్ల ద్వారా పొందాలని సూచించారు. మాడుగుల నియోజకవర్గంలో సొంత స్థలమున్న 5,600 మందికి ఇళ్లు మంజూరు చేశామని, నవంబరు నుంచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ. 153 కోట్లతో నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో లింక్‌ రోడ్లను తారుతో చేపడతామన్నారు. నవరత్నాల పథకాలలో 99 శాతం పూర్తి చేశామని, వాటిలో రత్నంలాంటిది చేయూత పథకమని కొనియాడారు.  ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ చేయూత సొమ్ముతో జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలన్నారు. కలెక్టరు రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ 5,518 మందికి రూ. 10.35 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. ఎంపీపీ రామధర్మజ, జడ్పీటీసీ సభ్యురాలు అనూరాధ, ఉపాధ్యక్షులు తాళపురెడ్డి రాజారామ్‌ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు కిముడు రమణమ్మ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన శాఖ ప్రదర్శనను తిలకించారు. మంత్రి బూడి ప్రసంగం ముగిస్తున్న తరుణంలో వర్షం జోరందుకుంది. ఎంతకీ వాన ఆగకపోవడంతో వచ్చిన వారు తలలపై కుర్చీలు పెట్టుకుని భోజనాలు చేశారు. సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్సైలు దామోదరనాయుడు, ధనంజయ్‌ బందోబస్తు నిర్వహించారు. అనంతరం మాడుగుల జూనియర్‌ కళాశాలలో రూ. 1.24 కోట్లతో చేపట్టే భవనాల మరమ్మతు పనులకు మంత్రి బూడి, ఎంపీ సత్యవతి, కలెక్టరు రవి భూమి పూజ చేశారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం చేశారు. కళాశాల ఛైర్మన్‌ శ్రీనాథు శ్రీనివాసరావు అతిథులను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని