logo

తిన్నదెంత.. తిరిగిచ్చిందెంతా?

ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చి 15 ఏళ్లయింది. ఈ పథకం కింద చేపట్టిన పనులపై ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తిస్తున్నారు. బాధ్యులైన వారికి తాఖీదులు జారీచేసి వివరణలు తీసుకుంటున్నారు. వాటిపై సంతృప్తి చెందకుంటే రికవరీలకు ఆదేశిస్తున్నారు.

Published : 25 Sep 2022 06:32 IST

సామాజిక తనిఖీల్లో గుర్తించినా చర్యలేవీ?

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చి 15 ఏళ్లయింది. ఈ పథకం కింద చేపట్టిన పనులపై ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తిస్తున్నారు. బాధ్యులైన వారికి తాఖీదులు జారీచేసి వివరణలు తీసుకుంటున్నారు. వాటిపై సంతృప్తి చెందకుంటే రికవరీలకు ఆదేశిస్తున్నారు. అలా ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటికి 12 రౌండ్లలో తనిఖీలు పూర్తయ్యాయి. ఈ పదిహేనేళ్లలో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.43.50 కోట్ల మేర నిధుల వినియోగంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందులో రికవరీ చేయదగింది ఎంతో పూర్తిగా తేల్చలేకపోయారు. ఇప్పటివరకు రూ.11.68 కోట్లు రికవరీకి ఆదేశించినా.. అందులో 50 శాతం కూడా అక్రమార్కుల నుంచి రాబట్టలేకపోయారు. మరో రూ.30 కోట్ల తేడాలకు సంబంధించి అక్రమమెంతో తేల్చాల్సి ఉంది. 
ఉమ్మడి జిల్లాలో గత 13 ఏళ్లలో రూ.35.50 కోట్ల ఉపాధి నిధుల వినియోగంలో తేడాలు గుర్తించారు. గత రెండేళ్లలోనే సుమారు రూ.18 కోట్ల మేర అవకతవకలు చోటుచేసుకోవడం విశేషం.
మస్తర్ల మాయాజాలం, కొలతల్లో తేడాలు, బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, నాటిన మొక్కలు కనిపించకపోవడం, చేసిన పనులకు సంబంధించి దస్త్రాలను చూపకపోవడం వంటి అభియోగాలున్నాయి. వీటిలో వాస్తవమేంటో తేల్చాకే అక్రమార్కుల నుంచి రికవరీలు చేపట్టాలి. ఈ ప్రక్రియలోనే అంతులేని జాప్యం జరుగుతోంది. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లలో సామాజిక తనిఖీలను పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. బాధ్యులుగా గుర్తించిన వారిపై వ్యక్తిగత విచారణలు చేయలేకపోయారు. దీంతో ఎవరెవరి నుంచి ఎంత మొత్తంలో రికవరీ చేయాలో స్పష్టం కాలేదు. ఈలోగా ఉన్నతాధికారులు, నేతలతో పైరవీలు చేయించుకుని రూ.లక్షల్లో ఉండే రికవరీ మొత్తాలను రూ.వేలల్లోకి మార్చుకుంటూ కొంతమంది అక్రమాల నుంచి బయటపడుతున్నారు.

అక్రమాల్లో కొన్ని ఇలా..
* డీఆర్‌డీఏ ద్వారా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్‌లో రూ.1.79 కోట్లు మేర అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీల్లో గుర్తించారు. ఇందులో కేవలం రూ.37.09 లక్షల మాత్రమే రికవరీ చేయగలిగారు. మరో రూ.20 లక్షలు అభియోగాలను రద్దుచేశారు. అయినా ఇంకా రూ.1.21 కోట్లు బాధ్యుల నుంచి రికవరీ చేయాల్సి ఉన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
* రోలుగుంట మండలం నిండుగొండలో గ్రామంలో లేనివారి పేర్లు, జీడిపిక్కల కంపెనీలో పనిచేసేవారి పేరున మస్తర్లు వేసి భారీగా ఉపాధి వేతనాలు దారి మళ్లించారు. జానకీరామపురంలో ఓ ఉపాధ్యాయుడు, ఆర్మీ సిపాయి పేర్లతో కూడా మస్తర్లు వేసి సొమ్ము స్వాహా చేశారని గుర్తించారు. రావికమతం మండలంలోనూ ఈ తరహా అక్రమాలు వెలుగుచూశాయి.
* ఏజెన్సీలోని చింతపల్లి, పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో గతంలో యంత్రాలతో పనులు చేసి కూలీల పేరిట మస్తర్లు వేసి సొమ్ములు స్వాహాకు పాల్పడ్డారు. మరుగుదొడ్ల సొమ్ములు సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నా సొమ్ములు వెనక్కి రాబట్టలేకపోయారు.

నిరంతర ప్రక్రియ : సామాజిక తనిఖీల్లో గుర్తించిన కొన్ని సాంకేతికపరమైన అంశాలకు సిబ్బందిని బాధ్యులుగా చేయడానికి వీలవ్వదు. వారిపై అభియోగాలను తొలగించడానికి రికవరీ మొత్తం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. కొవిడ్‌తో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని మండలాల్లోనూ గత రెండేళ్లలో చేపట్టిన పనులపై విచారణలు జరిపిస్తున్నాం. రికవరీ శాతం బాగానే ఉంది. - సందీప్‌, డ్వామా పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని