logo

ఐసీడీఎస్‌ గ్రేడ్‌-2 పర్యవేక్షకుల ఫలితాలు విడుదల

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు సంబంధించి ఐసీడీఎస్‌ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. 76 పోస్టులకు 1:2 ప్రకారం 152 మంది పేర్లను మాత్రమే విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Published : 26 Sep 2022 05:22 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు సంబంధించి ఐసీడీఎస్‌ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. 76 పోస్టులకు 1:2 ప్రకారం 152 మంది పేర్లను మాత్రమే విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫలితాల విడుదలపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంపిక చేసిన వారి వివరాలను మాత్రమే పంపించటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఏ విధంగా ఎంపిక చేశారో కూడా తెలియని పరిస్థితి నెలకుంది. ఎంపికైన వారికి వచ్చిన మార్కుల వివరాలు కూడా తెలియరాలేదు. ఆదివారం రోజున కూడా ఎంపికైన వారి ‘మైసెల్ఫ్‌’ పేరిట వీడియోను చిత్రీకరించి అప్‌లోడ్‌ చేయించాలని రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు రావటంతో ఆయా ప్రాజెక్టులకు చెందిన పీవోలు వారికి సమాచారం అందించి వీడియోలను అప్‌లోడ్‌ చేయించారు. విశాఖ జోన్‌ పరిధిలో 76 పోస్టులు ఖాళీలుండగా 5140 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 3990 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన తర్వాత ఆ శాఖ అధికారులు కీ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎలాంటి కీ విడుదల చేయలేదు. అలానే ప్రాజెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. మార్కుల జాబితాపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. అలాంటిదేమి చేయకుండానే కొంతమంది పేర్లను మాత్రమే ఐసీడీఎస్‌ కార్యాలయాలకు పంపించి, వారితో ఆంగ్ల పరిజ్ఞానం పరిశీలన నిమిత్తం వీడియోలను చేసి పంపించాలని ఆదేశించటంతో యూనియన్‌ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇతర జోన్లలో పరీక్ష రాసిన అంగన్‌వాడీ కార్యకర్తలందరితో వీడియోలు చేయించి పంపించారనే ఆరోపణలున్నాయి. ఒక్కో జోన్‌కు ఒక్కో న్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంపిక చేసిన వారిలో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఉన్నట్లుగా తెలుస్తోందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిటీ పరిధిలో అర్బన్‌-1 పరిధిలో ఒకరు, అర్బన్‌-2 పరిధిలో ముగ్గురి పేర్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా పరిధిలో కూడా ఆదివారం కొంతమంది చేత వీడియోలు చేయించి అప్‌లోడ్‌ చేయించారు. ఈ పరీక్ష విధానంపై యూనియన్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. నియామకాలు వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని