logo

భూములిచ్చినవారి బాధ పట్టదా?

భూమే ఆధారంగా బతికే సన్న, చిన్నకారు రైతులు... ఎకరా, రెండు ఎకరాలతో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల వద్ద ఇళ్ల స్థలాల కోసమంటూ ప్రభుత్వం భూములు సేకరించింది. తీసుకున్న భూమికి బదులు ల్యాండ్‌పూలింగ్‌లో

Published : 26 Sep 2022 05:22 IST

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న నిర్వాసితులు (పాతచిత్రం)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: భూమే ఆధారంగా బతికే సన్న, చిన్నకారు రైతులు... ఎకరా, రెండు ఎకరాలతో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల వద్ద ఇళ్ల స్థలాల కోసమంటూ ప్రభుత్వం భూములు సేకరించింది. తీసుకున్న భూమికి బదులు ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాలు జిరాయితీగా ఇస్తామని ప్రకటించింది. ఈ మాటలు నమ్మి భూములిచ్చిన వారంతా నేడు లబోదిబోమంటున్నారు. తమకు ఇస్తామన్న స్థలాలు ఎప్పుడిస్తారంటూ మూడేళ్లగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సేకరించిన భూముల్లో లే అవుట్లు వేయడం పూర్తయినా నిర్వాసితులకు మాత్రం ఇప్పటికీ న్యాయం జరగలేదు.

జీవీఎంసీ పరిధిలో నివసిస్తూ సొంతగూడు లేనివారికి నవరత్నాలు... పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వారికి సెంటు చొప్పున స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం అనకాపల్లి మండలంలోని 13 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ విధానం కింద సుమారు 790 మంది వద్ద 1098.01 ఎకరాలు సేకరించారు. భూ సేకరణ సమయంలో డీఫారం పట్టా భూమి ఉన్న రైతులకు ఎకరాకి 18 సెంట్లు, ఆక్రమిత భూముల్లో ఉన్నవారికి 9 సెంట్ల చొప్పున అభివృద్ధి చేసిన స్థలాలు జిరాయితీగా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. సేకరించిన భూములను వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చారు. ఎంపిక చేసిన పేదలకు సెంటు చొప్పున స్థలాలను కేటాయించారు. అనకాపల్లి పట్టణ వాసులతోపాటు విశాఖ నగరంలో ఉన్నవారికి స్థలాలు కేటాయించి పట్టా మంజూరు ప్రక్రియ పూర్తిచేశారు. కానీ భూములిచ్చిన వారిని సంగతే మరిచిపోయారు. వీరికి సెంటు స్థలం కూడా ఇంకా అప్పగించలేదు. ప్రభుత్వాన్ని నమ్మి జీవనాధారమైన భూములు ఇస్తే తమ గోడు పట్టించుకోవడమే మానేశారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. 790 మంది ల్యాండ్‌ పూలింగ్‌ బాధితులంతా ఇప్పుడు పనులు మానుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


మమ్మల్ని పట్టించుకోవడం లేదు- రమణమ్మ, సంపతిపురం

ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం. ఎకరాకి 18 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మేమిచ్చిన భూముల్లో లే అవుట్లు వేశారు. ఎక్కడెక్కడి వారికో ఇస్తున్నారు. భూములు ఇచ్చిన మా సంగతి ఏంటని అడుగుతుంటే పట్టించుకోవడం లేదు. మా సమస్యను పరిష్కరించాలి.


ముందు మా సమస్య తీర్చాలి - కె.కొండబాబు, కూండ్రం

ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చిన మాకు ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు పట్టాలు ఇవ్వాలి. ముందు మా సమస్య తీర్చకుండా సెంటు చొప్పున భూమిని ఇచ్చి పట్టాలు అందిస్తున్నారు. మాకు న్యాయం చేయకుంటే పోరాటం చేస్తాం, సమస్యను పరిష్కరించేలా అధికారులు దృష్టి పెట్టాలి. లేకుంటే మా భూమిలోకి వచ్చే వారికి అడ్డుకుంటాం.


న్యాయం చేస్తాం. - చిన్నికృష్ణ, అనకాపల్లి ఆర్‌డీఓ

ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చినవారికి న్యాయం చేస్తాం. వారికి ప్రత్యామ్నాయం చూపించేలా వీఎంఆర్‌డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిలోనే స్థలాలు ఇస్తాం. వారితో మాట్లాడి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టే చర్యలు తీసుకుంటాం. లేఅవుట్లు పూర్తయ్యాయి. ముందుగా కుదుర్చుకన్న అంగీకారం ప్రకారం భూములిచ్చిన వారికి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన స్థలాలు అందిస్తాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts