logo

అత్యవసరమైతే అవస్థలే..!

సిటీ సర్వీసుల్లో పనిచేసే మహిళా కండక్టర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చి 8 గంటలపాటు నిలువుకాళ్లపై నిలబడి పని చేస్తారు. తరువాత డిపోకెళ్లి నిధులు, టికెట్లు అప్పగించి తిరిగి ఇంటికి చేరుకోవడానికి

Published : 26 Sep 2022 05:22 IST

మహిళా కండక్టర్ల యాతన

న్యూస్‌టుడే, ద్వారకానగర్‌ (కార్పొరేషన్‌)


ఇరుకు గదిలోనే సిబ్బంది

సిటీ సర్వీసుల్లో పనిచేసే మహిళా కండక్టర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చి 8 గంటలపాటు నిలువుకాళ్లపై నిలబడి పని చేస్తారు. తరువాత డిపోకెళ్లి నిధులు, టికెట్లు అప్పగించి తిరిగి ఇంటికి చేరుకోవడానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. ఈ మధ్యలో అత్యవసరమైతే వారి బాధలు వర్ణనాతీతం. ఒక్కోసారి బస్సులను ట్రాఫిక్‌ రద్దీ లేని శౌచాలయం వద్ద నిలపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యం ఇబ్బందులు పడుతున్నా పీడీటీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా కండక్టర్లు మండిపడుతున్నారు.

సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం

నగరంలో మధురవాడ, మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం డిపోలకు చెందిన 82 సర్వీసులు పాత పోస్టాఫీసుకు వెళతాయి. అవి రద్దీగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ కాంప్లెక్స్‌, జగదాంబకూడలి, పూర్ణమార్కెట్‌, ఏవీఎన్‌ కళాశాల, కేజీహెచ్‌, కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్తు, పోస్టాఫీసు వంటి ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఆయా బస్సులన్నీ నిత్యం ప్రయాణికులతో నిండిపోతాయి. వాటిల్లో 40 మంది వరకు మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాతపోస్టాఫీస్‌ చివరి బస్‌స్టాపు కావడంతో ప్రతి బస్సు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలపాటు ఇక్కడ వేచి ఉంటాయి. అయితే అక్కడ సిబ్బంది మూత్ర విసర్జనకు సరైన ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

* పాతపోస్టాఫీసు బస్‌స్టాప్‌ వద్ద గల నిరీక్షణ గదిలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వాటికి వాడుకనీటి సదుపాయం లేదు. దీంతో మున్సిపల్‌ కుళాయి నీటినే ఉపయోగిస్తున్నారు. ఆ నీరు రోజూ అరగంట పాటు మాత్రమే సరఫరా అవుతోంది. ఒక్కో సారి పది రోజులపాటు నీటి సరఫరా ఉండటంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఆయా సందర్భాల్లో భోజనాలకు ఉపయోగించే నీటినే మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. మరుగుదొడ్లను సైతం శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా ఉంటున్నాయి.

* మరుగుదొడ్లు సక్రమంగా లేవని, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఓ మహిళా కండక్టర్‌ పేర్కొన్నారు. అత్యవసరమైతే ట్రాఫిక్‌ లేని ప్రాంతాల్లో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద బస్సు నిలపాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రయాణికులున్నా బసు నిలిపాల్సి రావడంతో ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. పాత పోస్టాఫీసు వద్ద సిబ్బంది వేచి ఉండే గదికి వాడుక నీటి సరఫరా కోసం బోరు తవ్వించాలని అభిప్రాయపడ్డారు.

సమస్యల్ని పరిష్కరిస్తాం.. - ఎం.సత్యనారాయణ, డిప్యూటి సీటీఎం (అర్బన్‌)

ఆర్టీసీ మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మాదృష్టికి వచ్చాయి. పాతపోస్టాఫీసు బస్‌స్టాప్‌ వద్ద ఉన్న సిబ్బంది నిరీక్షణ గదిని పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తాం. మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేసే యంత్రానికి మరమ్మతులు చేయిస్తున్నాం. రెండు రోజుల్లో ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తాం.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని