logo

మందుల అమ్మకాలపై మరింత నిఘా

జిల్లాలో ఔషధాల తనిఖీ అధికారులకు ఎట్టకేలకు శాశ్వత ప్రాతిపదికపై సొంత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీంతో మందుల అమ్మకాలపై నిఘా మరింత పక్కాగా

Published : 26 Sep 2022 05:22 IST

అందుబాటులో తనిఖీ అధికారులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: జిల్లాలో ఔషధాల తనిఖీ అధికారులకు ఎట్టకేలకు శాశ్వత ప్రాతిపదికపై సొంత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీంతో మందుల అమ్మకాలపై నిఘా మరింత పక్కాగా నిఘా పెట్టేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లంతా అద్దె గదుల్లో కొనసాగుతున్నారు. వీరికి ఇప్పుడు పక్కా భవనాలు సమకూరుతున్నాయి. నర్సీపట్నంలో ఇప్పటికే ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అనకాపల్లిలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఔషధ తనిఖీ అధికారులంతా ఇప్పటివరకు మందుల దుకాణాల పర్యవేక్షణ, వాటిలో నకిలీ ఔషధాలు అమ్మకుండా నిరోధించే పనులకే పరిమితమయ్యారు. వీరిని ఇప్పుడు జనం అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సర్కారు వైద్యాలయాల్లోనే వీరికి కార్యాలయాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 భవనాలు వీరి కోసం సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఎం) ఇందుకోసం నిధులు విడుదల చేసింది. ఏడాది క్రితం చేపట్టిన వీటి పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇన్నాళ్లు అద్దె చెల్లిస్తూ చాలీచాలని ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న వీరికి ఇక సౌకర్యవంతమైన, విశాలమైన భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటే ఔషధాలపై మరింత నిఘా పెట్టేందుకు మార్గం సుగమం కానుంది.

నర్సీపట్నంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఔషధ తనిఖీ అధికారి కార్యాలయ భవనం

జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లిలో ఎన్‌హెచ్‌ఎంకు చెందిన మొత్తం రూ. 80 లక్షల నిధులతో ఔషధ తనిఖీ అధికారులకు పక్కా కార్యాలయాల భవనాలు ఏర్పాటవుతున్నాయి. తొలుత అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మాత్రమే దీనిని నిర్మించాలని భావించారు. ఇటీవల అనకాపల్లి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో నర్సీపట్నంలోనూ దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో 150 పడకల ప్రాంతీయ ఆసుపత్రి వెనుక భాగంలో చేపట్టిన ఇది ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ భవనాల్లో శీతలీకరణ సదుపాయం తదితర హంగులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటి వరకు అద్దె గదులకు ఏటా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. పక్కా సొంత భవనాలతో ఇక ఈ సొమ్ము అంతా  ప్రభుత్వానికి ఆదా కానుంది.

త్వరలో భవనం స్వాధీనం -ఎన్‌.యుగంధర్‌, ఔషధ తనిఖీ అధికారి, నర్సీపట్నం

నర్సీపట్నంలో పూర్తయిన భవనాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేతులమీదుగా దీనిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇది ప్రారంభమైతే కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి రోగులతోపాటు 17 మండలాల్లోని వారంతా ఔషధాలకు సంబంధించిన ఏ ఫిర్యాదు అయినా ఇక్కడ అందజేయవచ్చు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని