logo

వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతాయని నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Published : 26 Sep 2022 05:26 IST

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల అభిప్రాయం


మాట్లాడుతున్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్‌

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-ఎంవీపీకాలనీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతాయని నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఓ ఫంక్షన్‌హాల్లో ‘వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్‌టేబుల్‌ సమావేశం’ పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాలన వికేంద్రీకరణ కారణంగా ఒనగూరే ప్రయోజనాలను వారు వివరించారు. అనేక వనరులతో రాజధానికి సిద్ధంగా ఉన్న నగరంలో విశాఖ ఒకటని అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్‌ ఈ కార్యక్రమ అధ్యక్షుడిగా ప్రసంగిస్తూ పాలన వికేంద్రీకరణ అన్నది కొత్త అంశమేమీ కాదన్నారు. విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన ఆంధ్రరాష్ట్రం ఏర్పడే సమయంలోనే వచ్చిందన్నారు. 1953లో ఒకసారి, 1956లో మరోసారి విశాఖ పేరు తెరపైకి వచ్చిందని, అసెంబ్లీలో దానిపై చర్చలు కూడా జరిగాయని, తరువాత కాలంలో మారిపోయాయని గుర్తుచేశారు. ఆయా అంశాలకు సాక్ష్యంగా నాడు పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆయన ప్రదర్శించారు.

* ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు టి.డి.ఎల్‌.పి. సమావేశం జరగ్గా 42 శాతం మంది విశాఖకే మద్దతు పలికారన్నారు. కాకపోతే గుంటూరు, విజయవాడ నగరాలు కావాలని కోరుకున్న వారి శాతం ఎక్కువగా ఉండడంతో ఆ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు చేశారని... తాను మాత్రం విశాఖే రాజధానిగా ఉండాలని చెప్పానని గుర్తుచేశారు.

* నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖను రాజధానిగా మార్చడానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం అనేక కమిటీలు కూడా విశాఖ అనుకూలమని అభిప్రాయపడ్డాయని గుర్తుచేశారు.

* సెంచూరియన్‌ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జి.ఎస్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ విశాఖ నగరం రెడీమేడ్‌ రాజధానిలాంటిదన్నారు. విశాఖలో అన్ని వసతులతోపాటు అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కృష్ణమోహన్‌ మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోపాటు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్నారు.  

* రచయిత చందు సుబ్బారావు మాట్లాడుతూ విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తే దానంతటదే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.  

* ఉత్తరాంధ్ర రక్షణ సమితి ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో కూడా అనేక మంది పరిశ్రమలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం వేలాది ఎకరాలను ఇచ్చారని, వారి గురించి ఎవరూ చెప్పడంలేదని వాపోయారు.

* వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమన్నారు. విశాఖలో అన్ని వర్గాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

* ఏయూ ఆచార్యుడు ఆచార్య షారోన్‌రాజు మాట్లాడుతూ ఏయూలోని ఉద్యోగులు, ఆచార్యులు, పరిశోధకులు అందరం ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి పాలన వికేంద్రీకరణకు మద్దతు పలికామని గుర్తుచేశారు.

* ఆళ్వార్‌దాస్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ ఎస్‌.పి.రవీంద్ర మాట్లాడుతూ విశాఖ నగరం అందర్నీ స్వాగతిస్తుందని తెలిపారు.  

* ఏయూ విశ్రాంత ఆచార్యుడు ఆచార్య విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ విశాఖ పాలన రాజధానికి మద్దతుగా అరసవల్లి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేయాలని సూచించారు.

* ఉత్తరాంధ్ర ఫోరం ప్రతినిధి శివశంకర్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు.

* విద్యుత్తు ఉద్యోగుల సంఘం ప్రతినిధి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వీకేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ది సాధ్యమన్నారు.

* డాక్టర్‌ షంషుద్దీన్‌ మాట్లాడుతూ విశాఖను రెండో ముంబయిగా రాజీవ్‌గాంధీ అభివర్ణించారని గుర్తు చేశారు.

* ఫార్మారంగ ప్రతినిధి లాల్‌కృష్ణ మాట్లాడుతూ విశాఖ రాజధాని అయితే ఫార్మారంగం మరింత అభివృద్ధి చెంది మరో నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

* ఏయూ విశ్రాంత ఆచార్యుడు ఆచార్య సూర్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. విశాఖను రాజధానిగా చేయడానికి మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

* ఈ కార్యక్రమంలో మంత్రి అమర్‌నాధ్‌, ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, వరుదు కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని