logo

పరీక్ష రాసేందుకు వస్తే.. ప్రాణం పోయింది..

ఉపకార వేతనానికి సంబంధించి ప్రవేశపరీక్ష రాసేందుకు వెళ్తున్న బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన ఆదివారం ఉదయం కూర్మన్నపాలెం కూడలిలో చోటు చేసుకుంది. దువ్వాడ పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల మేరకు..

Published : 26 Sep 2022 05:26 IST

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం


ముద్దాడ కేశవి (పాత చిత్రం)

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉపకార వేతనానికి సంబంధించి ప్రవేశపరీక్ష రాసేందుకు వెళ్తున్న బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన ఆదివారం ఉదయం కూర్మన్నపాలెం కూడలిలో చోటు చేసుకుంది. దువ్వాడ పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల మేరకు..

* శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మట్టవానిపేటకు చెందిన ముద్డాడ గోపాలరావు కుమార్తె కేశవి (13) అదే మండలం కరవంజి గ్రామంలోని ఏపీ మోడల్‌ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ‘పీఎం యశస్వి’ ఉపకారవేతన అవార్డు ప్రవేశ పరీక్ష రాసేందుకు శనివారం సాయంత్రం తండ్రితో కలిసి అగనంపూడి సమీప కొత్తూరు రామాలయం వద్ద నివాసం ఉంటున్న మేనమామ సింహాచలం ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం ఆటోనగర్‌ కెనరా బ్యాంకు సమీప బెట్‌మెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయంలో పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలు దేరింది. జాతీయ రహదారి కూర్మన్నపాలెం కూడలి దాటిన తర్వాత వెనక నుంచి వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బాలిక తూలి రోడ్డుపై పడడంతో.. ఆమె తల మీద నుంచి లారీ చక్రాలు దూసుకెళ్లాయి.

* కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఇంతలో లారీ డ్రైవర్‌ వాహనంతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. గంగవరం పోర్టు వద్ద లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని