logo

గుండెలో గుబులు..!

కేజీహెచ్‌ హృద్రోగ విభాగానికి ఇటీవల వైద్యం కోసం 50 ఏళ్ల మహిళ వచ్చారు. ఆసుపత్రి ఐసీసీయూ విభాగ గేటు వద్ద కుప్పకూలిపోయారు. వైద్యులు సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టారు. తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు.

Published : 28 Sep 2022 03:33 IST

కొవిడ్‌ బాధితులూ.. తస్మాత్‌ జాగ్రత్త
రేపు ప్రపంచ హృదయ దినోత్సవం
విశాఖపట్నం, న్యూస్‌టుడే

కేజీహెచ్‌ కార్డియాలజీ ఐసీసీయూ విభాగం

* కేజీహెచ్‌ హృద్రోగ విభాగానికి ఇటీవల వైద్యం కోసం 50 ఏళ్ల మహిళ వచ్చారు. ఆసుపత్రి ఐసీసీయూ విభాగ గేటు వద్ద కుప్పకూలిపోయారు. వైద్యులు సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టారు. తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఇటువంటి పరిస్థితి కొంత మందికి ఇళ్ల వద్ద, పనిచేసే ప్రదేశంలో ఎదురవుతోంది. వారు తేరుకొని ఆసుపత్రికి వచ్చే లోపే పరిస్థితి విషమిస్తోంది.

* ‘కొవిడ్‌ బాధితుల్లో గుండె జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆకస్మికంగా (సడెన్‌)గా కుప్పకూలిపోయి ప్రాణాలు పోతున్న కేసులు నమోదవుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ముప్పు పొంచి ఉంద’ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురువారం ప్రపంచ హృదయ(గుండె) దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో హృద్రోగాల తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం..


హఠాత్తుగా కాటేస్తోంది..

* ఇటీవల కాలంలో ‘సడన్‌ కార్డియాక్‌ డెత్‌’ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేకపోయినా గుండెకు వెళ్లే రక్తనాళల్లో ఏర్పడే తేలిక పాటి గడ్డలు అంతర్భాగంలో ఒక్కసారి పగిలిపోయి గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి తీవ్రమైన నొప్పితో కుప్ప కూలిపోతున్నారు. వెంటనే షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగితే కొంత వరకు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ‘సడన్‌ కార్డియాక్‌ డెత్‌’లు 45 ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపిస్తాయని, ఇప్పుడు 30ఏళ్ల యువకులు ఈ వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడిస్తున్నారు.

కేజీహెచ్‌లో సౌకర్యాలు

* కేజీహెచ్‌ కార్డియాలజీ విభాగంలో అన్ని రకాల ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. వారంలో ఏడు రోజులూ ఓపీ నిర్వహిస్తున్నారు. ఏ సమయంలోనైనా హృద్రోగులు నేరుగా ఐసీసీయూకు వచ్చి చికిత్స పొందవచ్చు. ఈసీజీ, 2డి ఎకో, డిఫ్రిలేటరు, సీపీఆర్‌ వసతులతో పాటు క్యాథ్‌లాబ్‌ అందుబాటులో ఉన్నాయి.

* నెలకు 200 వరకు ఏంజియోగ్రామ్‌లు, మరో 40 నుంచి 50 వరకు స్టంట్లు వేస్తున్నారు. బైపాస్‌ సర్జరీలు సైతం చేస్తున్నారు. ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

* ఛాతిలో మంటగా ఉన్నా, గుండె పట్టేసినట్లు అనిపించినా, అధికంగా చెమటలు పట్టినా వెంటనే అప్రమత్తం కావాలి. ఈ తరహా లక్షణాలు గ్యాస్ట్రిక్‌ సమస్యలోనూ కనిపిస్తాయి. గుండె నొప్పిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40ఏళ్లు దాటిన వారందరూ ఆరు నెలలకోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గుండె జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే మొత్తం కేసుల్లో 10 శాతం యువత ఉంటున్నారు. వీరిలో కొవిడ్‌ బాధితులు ఎక్కువ ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు.


చక్కని జీవనశైలితో హృద్రోగాలు దూరం
- డాక్టర్‌ కేటీ హేమమాలిని, సహప్రొఫెసరు, కార్డియాలజీ విభాగం, కేజీహెచ్‌

గుండెలో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. హృద్రోగ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే చక్కని జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. యోగా సాధన చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఆయిల్‌తో కూడిన ఆహారం తగ్గించాలి. రాత్రిళ్లు ఎక్కువ సమయం మేలుకోకూడదు.

ఇవీ కారణాలు..

గుండె జబ్బులపై అవగాహన లేమి

తీవ్రమైన ఒత్తిళ్లు

శారీరక వ్యాయామం లేకపోవడం

ఊబకాయం

పొగ, మద్యం తాగడం

అధిక రక్తపోటు, మధుమేహం

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts