logo

ఏదొకటి చెప్పెయ్‌... కాలం గడిపెయ్‌

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతున్నా పనులు కావడం లేదు.కలెక్టరు మల్లికార్జున ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి సోమవారం ‘స్పందన’ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు.

Published : 29 Sep 2022 03:45 IST

ఇదీ ‘వీఎంఆర్‌డీఏ’ ఉద్యోగుల తీరు

కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు

- ఈనాడు, విశాఖపట్నం

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతున్నా పనులు కావడం లేదు.కలెక్టరు మల్లికార్జున ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి సోమవారం ‘స్పందన’ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై స్పందించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా కొందరు ఉద్యోగులు ఏదొక కారణం చెబుతూ వాయిదా వేస్తున్నారు. కొందరు హైదరాబాద్‌, విజయవాడ, కాకినాడ, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొన్నేళ్లుగా వారి సమస్యలు పెండింగులో ఉన్నా పట్టించుకోవడంలేదు. ఎక్కువగా పరిపాలన, ఎస్టేట్‌, ప్లానింగ్‌ విభాగాల్లో ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో..

వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సెక్రటరీ ఆధ్వర్యంలో పరిపాలన విభాగం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ చేయడం లేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించినా రిజిస్ట్రేషన్‌కు పలుమార్లు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏకు పూర్తిస్థాయి సెక్రటరీ లేరు. సంయుక్త కమిషనర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కొనుగోలుదారులు 8వ అంతస్తులోని పరిపాలన విభాగాన్ని సంప్రదిస్తుంటే కొద్ది రోజులు తరువాత రావాలని సమాధానం ఇస్తున్నారు. ప్లాట్ల క్రయవిక్రయాలకు వీఎంఆర్‌డీఏ నుంచి రావాల్సిన నిరభ్యంతర పత్రం ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుందనే విమర్శలు వచ్చాయి.

దస్త్రాలు చూస్తున్నాం...

ఎస్టేట్‌ విభాగంలో ఏ దస్త్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి. అవసరమైన పత్రాల కోసం ప్రజలు ఏళ్లుగా తిరుగుతున్నా కొందరు ఉద్యోగుల నుంచే వచ్చే సమాధానం ఒకటే...‘బీరువాల్లో దస్త్రాలు వెతుకుతున్నాం’ అని. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వాటికి కూడా ప్లానింగ్‌, ఇతర విభాగాల్లో కనీసం సమాధానాలు లేకపోవడం గమనార్హం. దీంతో విసిగెత్తిన దరఖాస్తుదారులు సమాచార కమిషనర్‌ను సంప్రదిస్తున్నారు. పాత లేఅవుట్‌ కాపీలు, భూములకు సంబంధించిన వివరాలు, ఒప్పంద పత్రాలు వంటివి కోరినా నెలల సమయం పడుతోంది.

వివరాలు తెలియజేస్తే..

ప్రతి సోమవారం స్పందన నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని మా దృష్టికి తీసుకురావొచ్ఛు పరిష్కరించేలా చూస్తాం. రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నాం. ఎవరికైనా చేయకపోతే ఆ వివరాలు చెప్పొచ్ఛు తగు ఆదేశాలు ఇస్తాం’ అని వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల పేర్కొన్నారు.

డబ్బులు చెల్లించినా..

‘వుడా కాలనీలో ప్లాట్‌ కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాం. మా అమ్మ నుంచి మాకు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కొంతకాలంగా తిరుగుతున్నాం. కొంత మొత్తం చెల్లించాలని చెబితే అదీ 2020లోనే చెల్లించేశాం. ఇటీవల రెండు సార్లు వచ్చాం. మళ్లీ రావాలని సమాధానం ఇచ్చారు. గత నెలలో దస్త్రంతో అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాం. తాజాగా ఈ నెల 12 వీఎంఆర్‌డీఏ 8వ అంతస్తులో సంప్రదిస్తే కొద్ది రోజులు తరువాత రమ్మని చెప్పారు. పనులు మానుకొని ప్రత్యేకంగా రావాల్సి వస్తోంది’ అని విజయనగరం జిల్లా వాసి ఒకరు వాపోయారు.

నమ్మకంగా కొంటే..

‘ఎండాడలో వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ప్లాట్లను నమ్మకంతో కొనుగోలు చేశాం. కొందరు డబ్బులు మొత్తం చెల్లించేశారు. మరికొందరు సగం వాయిదాలు చెల్లించారు. పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. మరో వైపు అక్కడి స్థలం కొంత వివాదంలో ఉందంటున్నారు. పదేళ్లు గడిచినా ఆ సమస్యకు పరిష్కారం చూపలేదు. కమిషనర్‌ మారినపుడల్లా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని ఎండాడ లేఅవుట్‌ సంఘ సభ్యులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు