logo

‘రాజీవ్‌ స్వగృహ’ బాధితుల గగ్గోలు

సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ‘రాజీవ్‌ స్వగృహ’ పథకానికి దరఖాస్తు చేసిన వారు ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. పథకం ఆగిపోయినా... తాము అప్పటికే చెల్లించిన రుసుములు వెనక్కి ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 Sep 2022 03:57 IST

సొమ్ములకు వేల మంది ఎదురుచూపు

వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తున్న ప్రజలు

-ఈనాడు, విశాఖపట్నం

రాజీవ్‌ స్వగృహ స్థలం 

సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ‘రాజీవ్‌ స్వగృహ’ పథకానికి దరఖాస్తు చేసిన వారు ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. పథకం ఆగిపోయినా... తాము అప్పటికే చెల్లించిన రుసుములు వెనక్కి ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రశీదులు, ఇతర వివరాలు సక్రమంగా లేవంటూ డబ్బులు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించడం లేదు. మధ్యతరగతి ప్రజలకు రెండు, మూడు గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని దరఖాస్తులు ఆహ్వానించి...ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. ఆ తరువాత పథకం రద్దవగా... ఇందుకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం  ప్రస్తుతం అమ్మకానికి పెట్టింది.

*  తాము కట్టిన సొమ్ములు వెనక్కి ఇచ్చేయాలని కొందరు 2010లో దరఖాస్తు చేశారు. ఆ సమయంలో బడ్జెట్‌ లేదని సమాధానం ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఇవ్వకపోగా చెల్లించిన డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకోవడంపై చాలామంది విసుగు చెందారు. కొందరైతే తిరిగి తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరికొందరు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు తమకు జరిగిన అన్యాయంపై అక్కడి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు చెల్లించిన రూ.5వేలకు 18 శాతం వడ్డీతో చెల్లించాలని ఫిర్యాదుదారులు కోరారు. ‘ఏళ్లపాటు బాధితులను మనోవేదనకు గురి చేసినందుకు రూ.50 వేలు పరిహారంగా ఇవ్వాలి. ఫిర్యాదుదారు ఖర్చు నిమిత్తం రూ.2 వేలు చెల్లించాలి’ అని కార్పొరేషన్‌ అధికారులను ఫోరం ఇటీవల ఆదేశించింది.

*  ఉమ్మడి విశాఖతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా నాడు వేల మంది దరఖాస్తు చేశారు. ఆ ప్రాజెక్టు రద్దవడంతో  ... డబ్బులు కావాలనుకునే దరఖాస్తుదారులు ఏదైనా ఒక ఆధారం చూపిస్తే...ఇక్కడి అధికారులు ప్రధాన కార్యాలయానికి దస్త్రం పంపి రుసుం వాపసుకు అనుమతి తీసుకుంటున్నారు. 15 ఏళ్ల కిందట దరఖాస్తు చేసిన వారిలో కొందరు మృతిచెందారు. మరికొందరు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏళ్లు గడవడంతో చాలా మంది వద్ద రశీదులు తగిన ఆధారాలు ఉండడం లేదు.

ఏ ఆధారం ఉన్నా చెల్లిస్తున్నాం: ‘అప్పట్లో డబ్బులు చెల్లించినట్లు దరఖాస్తుదారు వద్ద  ఏ చిన్న ఆధారం ఉన్నా వాపసు ఇచ్చేస్తున్నాం. ప్రస్తుతం ఎందరు వచ్చినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కార్యాలయంలో సంప్రదిస్తే సరిపోతుంది. సదరు వ్యక్తి డబ్బు చెల్లించినట్లు నమ్మేలా ఉండాలి. కొందరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. దాన్ని పరిశీలిస్తాం’ అని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ జీఎం రవికుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని