logo

భూ ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం

రైతుల భూ ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం చేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు. ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల మ్యుటేషన్ల సమయంలో రైతు ఇచ్చిన ఫోన్‌ నెంబరుకు ఓటీపీ వస్తుందని, ఓటీపీ

Published : 30 Sep 2022 03:57 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రైతుల భూ ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం చేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు. ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల మ్యుటేషన్ల సమయంలో రైతు ఇచ్చిన ఫోన్‌ నెంబరుకు ఓటీపీ వస్తుందని, ఓటీపీ సంఖ్య చెబితే కాని తదుపరి ప్రక్రియ ముందుకు సాగదన్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఒకరి భూమి మరొకరు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని, అక్రమాలకు అవకాశం ఉండబోదన్నారు. ఈ కారణంగా భూ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు రైతుల నుంచి ఆధార్‌ వివరాలను సేకరిస్తున్నామని జేసీ వివరించారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం, ఆనందపురం మండలాల పరిధిలో ఉన్న రాజయ్యపేట, నిడిగట్టు, ఆర్‌వి అగ్రహారం, బుడ్డివలస, చిన్నాపురం, తిమ్మాపురం, కనుమ, ఎన్‌జిఆర్‌ పురం బిట్‌1, ఎన్‌జిఆర్‌పురం బిట్‌2 గ్రామాల్లో సర్వే పూర్తి అయిందన్నారు. ఆయా గ్రామాల్లోని రైతులకు ఎల్‌పిఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌)లు ఇస్తున్నామని, ఈకేవైసీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఉన్న మిగిలిన గ్రామాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సమగ్ర భూసర్వే, భూరక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని