logo

కొంచెం ప్రోత్సాహం.. అతివల ఉత్సాహం

తాజాగా చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated : 01 Oct 2022 05:36 IST

బ్యాంకు రుణాల ‘చేయూత’
ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు!

ఉత్పత్తులు విక్రయిస్తున్న పొదుపు సంఘాల మహిళలు

తాజాగా చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపార సామర్థ్యాన్ని అనుసరించి ఒక్కో మహిళలకు రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణం ఇప్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాచరణ రూపొందించింది.

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఆధునిక జీవనంలో పేద, మధ్య తరగతి వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంటిల్లిపాదీ కష్టపడితేగానీ పూట గడవని పరిస్థితి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సంక్పలంతో కొందరు మహిళలు వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేస్తున్నారు.
చేయూత పథకం ద్వారా నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాల్లో సుమారు ఆరు వేల మందికి మూడు విడతల్లో రూ.31.1 కోట్ల వరకు ఆర్థిక తోడ్పాటు లభించింది. వీరిలో ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారన్నది పొదుపు సంఘాల నిర్వాహకుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. చాలామంది తినుబండారాల తయారీ, విక్రయం, మన్యంలో పండే అల్లం, పసుపు వంటి ఉత్పత్తుల విక్రయం ద్వారా, కొందరు అడ్డాకులతో మిషన్లపై విస్తర్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ వ్యాపారం ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందింది. చాలా మంది మహిళలు ఇప్పుడు వీటి విక్రయాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఎలమంచిలిలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించగా.. అక్కడ ఓ మహిళ వన్‌గ్రామ్‌ గోల్డు నగల విక్రయ స్టాల్‌ ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసే సమయానికి రూ.ఐదు వేల విలువైన వస్తువులు విక్రయించడం గమనార్హం. దీంతో ఎక్కడ నాలుగైదు వందల మంది మహిళలు హాజరయ్యే సమావేశం జరిగినా మహిళలు తయారు చేసే వస్తువులు విక్రయానికి ఉంచేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.

వస్త్ర సంచులు తయారు చేస్తా: వ్యాపారంలో కొంత అనుభవం ఉంది. చేయూత, ఆసరా తదితర పథకాల కింద అందిన ఆర్థిక తోడ్పాటును వ్యాపారంలో పెట్టుబడిగా వాడుకుంటున్నా. వన్‌గ్రాం గోల్డు నగలు, చీరలు వంటివి ఇంటి చుట్టుపక్కల విక్రయిస్తుంటా. బ్యాంకు రుణం మంజూరైతే వస్త్ర సంచులు తయారు చేసి విక్రయిస్తాం. టైలరింగ్‌ అనుభవంతో కొంతమందికి ఉపాధి ఇవ్వడానికి వీలుంటుంది. - సీహెచ్‌ సుబ్బలక్ష్మి, నర్సీపట్నం

రుణాలిచ్చేందుకు అంగీకారం : వ్యాపారంలో రాణిస్తున్న మహిళలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు అధికారులు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చేయూత లబ్ధిదారుల్లో ఎక్కువ మంది స్వయం ఉపాధి, వివిధ రకాల వస్తువుల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో బ్యాంకు రుణాలు ఎవరికి అవసరమన్నది పరిశీలిస్తున్నా. అవసరమైన వారికి రుణం అందేలా చూస్తాం. - సరోజిని, మెప్మా పీడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని