logo

విశాఖ చిరుత... జ్యోతి!

వంద మీటర్ల హర్డిల్స్‌లో  రికార్డుల మోత మోగించిన విశాఖ అథ్లెటిక్‌ జ్యోతి.. వంద మీటర్ల పరుగులోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఛాంపియన్లుగా పేరున్న వారిని సైతం వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ

Updated : 02 Oct 2022 05:13 IST

వంద మీటర్ల పరుగులో జాతీయ రికార్డు

ఈనాడు, విశాఖపట్నం : వంద మీటర్ల హర్డిల్స్‌లో  రికార్డుల మోత మోగించిన విశాఖ అథ్లెటిక్‌ జ్యోతి.. వంద మీటర్ల పరుగులోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఛాంపియన్లుగా పేరున్న వారిని సైతం వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో వంద మీటర్ల పరుగును 11.51 సెకన్లలో అధిగమించి స్వర్ణం  సాధించింది. దీంతో నగరంలోని కైలాసపురంలో ఉంటున్న ఈమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. జాతీయ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించడంతో క్రీడాభిమానులు సంతోషంవ్యక్తం చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ అథ్లెట్లయిన ద్యుతిచంద్‌, హిమాదాస్‌లను వెనక్కినెట్టి విజయం సాధించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పేదరికం వెక్కిరించినా: పేదరికం వెక్కిరించినా శిక్షకుల ప్రోత్సాహంతో వెనుదిరిగి చూడకుండా జ్యోతి కొత్త రికార్డులు నమోదు చేస్తుంది. ప్రస్తుతం దేశంలోనే వేగవంతమైన హార్డ్లెర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రీడాతేజం తాజాగా వంద మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి ఫాస్టెస్టు రన్నరుగానూ కీర్తిగడించింది. ఈ ఏడాది మేలో సైప్రస్‌ దేశంలో జరిగిన ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్‌ మీట్‌లో 20 ఏళ్ల కిందటి రికార్డును బద్దలుకొట్టింది. 2002లో అనురాధ బిశ్వాల్‌ 13.38 క్షణాల్లో 100 మీటర్లు అధిగమించి రికార్డు నెలకొల్పగా జ్యోతి 13.23 క్షణాల్లోనే అధిగమించింది. ఆ తరువాత అదే నెలలో నెదర్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్‌ పోటీలోనూ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. వంద మీటర్ల హర్డిల్స్‌లో 13.04 క్షణాల్లోనే పరుగెత్తి రికార్డు నెలకొల్పింది. ఒక ఖేలో ఇండియా యూనివర్సిటీ మెడల్‌, 3 ఆల్‌ ఇండియా పతకాలు, రెండు సీనియర్‌ జాతీయ పతకాలు, ఏడు జూనియర్‌ పతకాలు, రాష్ట్రస్థాయి పతకాలు 27 సాధించింది. 18 జాతీయ క్రీడల్లో పాల్గొంది.

ఇంట్లో కష్టమైనా: కైలాసపురంలో ఉంటున్న జ్యోతిది సాధారణ కుటుంబం. తండ్రి సూర్యనారాయణ ప్రైవేటు సెక్యూరిటీగార్డు. తల్లి కుమారి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపట్ల ఆసక్తి ఉండడంతో ఇంట్లో ఇష్టంలేకపోయినా క్రీడల్లో పాల్గొంది. పదోతరగతి చదువుతుండగానే అథ్లెటిక్స్‌ సాధన చేస్తానని చెబితే మందలించారు. 2016లో కేరళలో జరిగిన జూనియర్‌ యూత్‌ నేషనల్‌ అథ్లెటిక్‌ పోటీల్లో తొలి విజయం సాధించిన తరువాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అథ్లెటిక్‌కు శిక్షణకు స్పైక్‌ షూ చాలా అవసరం. ఆ సమయంలో  చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా రోజులు నాణ్యత లేని షూలతోనే పోటీల్లో పాల్గొన్నారు. అలా సాధన చేసి ఎన్నో గాయాలను భరించి విజయాలను అందిపుచ్చుకుంటోంది.
బీ జ్యోతి స్వర్ణం సాధించడమే కాకుండా సరికొత్త రికార్డు నెలకొల్పడంపై విశాఖ జిల్లా అథ్లెటిక్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని