logo

హే.. మహాత్మా.. ఇదేం గ్రామ స్వరాజ్యం!

ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించక ముందు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.120 కోట్లు విద్యుత్తు ఛార్జీల పేరుతో మళ్లించారు. సర్పంచులుగా ఎన్నికయిన తర్వాత విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కూడా తమ అనుమతి లేకుండా వెనక్కి తీసుకున్నారు.

Published : 02 Oct 2022 04:52 IST

నిధులు, విధులు కోసం సర్పంచుల భిక్షాటన
జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు
ఈనాడు డిజిటల్‌, పాడేరు


జీతాలు బకాయిలు చెల్లించాలంటూ అనకాపల్లి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు, క్లాప్‌ మిత్రాలు (పాతచిత్రం)


స్వాతంత్య్రం కంటే పారిశుద్ధ్యం ముఖ్యం. జీవన విధానంలో పరిశుభ్రత, పారిశుద్ధాన్ని అంతర్భాంగా చేసుకోవాలి  
- మహాత్మాగాంధీ


మ్మడి జిల్లాలో 969 పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించక ముందు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.120 కోట్లు విద్యుత్తు ఛార్జీల పేరుతో మళ్లించారు. సర్పంచులుగా ఎన్నికయిన తర్వాత విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కూడా తమ అనుమతి లేకుండా వెనక్కి తీసుకున్నారు. సాధారణ నిధులను సైతం ఖర్చుచేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో సర్పంచులు పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది.


‘పాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం.. మహాత్ముడు కలలుగన్న సమాజాన్ని సాకారం చేశాం’ అని సర్కారు పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆ మహనీయుడి ఆకాంక్షలకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల అధికారాల్లో కోతపెట్టడంతో.. సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. నిధులు దారి మళ్లించడంతో పల్లెల్లో కనీస అవసరాలను తీర్చలేకపోతున్నారు. మరోవైపు పల్లెల స్వచ్ఛతలో కీలకమైన పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోయాయి. దీంతో స్వచ్ఛ సంకల్పానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి సందర్భంగా సర్కారు చెబుతున్న గ్రామస్వరాజ్యం అమలు తీరుపై కథనం.

జీతాలే ఇవ్వకుంటే పారిశుద్ధ్యమెలా..!

స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్ర సాధన కోసమంటూ రూ.కోట్లు కుమ్మరిస్తున్నా అవన్నీ ఆరంభ శూరత్వంగానే మిగలిపోతున్నాయి. పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటం, నిధుల లేమి వెరసి స్వచ్ఛ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని సర్కారు గాలికి వదిలేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2,960 మంది క్లాప్‌ మిత్రలు, సంపద కేంద్రాల వద్ద మరో 679 మంది గ్రీన్‌ గార్డులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలి. ఈ ఏడాది మార్చి తర్వాత జీతాలు నిలిచిపోయాయి.

నిధుల మళ్లింపునకు నిరసనగా చింతపల్లిలో ఇటీవల భిక్షాటన చేసిన సర్పంచులు

సర్పంచులే భిక్షాటన చేస్తే స్వరాజ్యమంటామా..

మహాత్ముడు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం సాధించాలంటే సర్పంచులకు పూర్తి అధికారాలుండాలి. పల్లెలకు కేటాయించిన నిధులను వారే ఖర్చుచేయాలి. ఇదిలా ఉంటే కేంద్రం ఇచ్చే నిధులను సర్పంచుల సమ్మతితో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించేసుకుంటోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులే కాదు వీధి దీపాలు మార్చడానికి కూడా నిధుల్లేక విలవిల్లాడాల్సి వస్తోంది. ఇప్పటికే పల్లె ఖాతాలు ఖాళీ అయిపోయాయి. త్వరలో విడుదల చేయబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో కాకుండా పీడీ ఖాతాల్లోనే జమచేయాలని సర్కారు చూస్తోంది. దీంతో పల్లె పాలకులంతా ఆందోళన బాటపట్టారు. కొందరు సర్పంచులైతే కాలువలు ఊడ్చి, భిక్షాటన చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు, విధులు హరిస్తే గ్రామ స్వరాజ్యం ఎలా సిద్ధిస్తుందని సొంత పార్టీకి చెందిన సర్పంచులే ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని