logo

మార్చాల్సినవి లక్షపైనే..!

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 3.32 లక్షల మందికి జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు. గతంలో ఒకేసారి ఏడు రకాల సామగ్రిని విద్యార్థుల చేతిలో పెట్టారు.

Published : 02 Oct 2022 04:53 IST

బ్యాగులు, బూట్లు వెనక్కి..  విద్యాకానుకలో లోపాల దిద్దుబాటు
ఈనాడు డిజిటల్‌, పాడేరు

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 3.32 లక్షల మందికి జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు. గతంలో ఒకేసారి ఏడు రకాల సామగ్రిని విద్యార్థుల చేతిలో పెట్టారు.

జగనన్న విద్యాకానుక కిట్‌లో స్కూల్‌ బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్లు కూడా సరైన కొలతలు సరఫరా చేయలేదు. విద్యార్థులు వాటిని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జేవీకే కిట్ల నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులందడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.


స్కూల్‌ బ్యాగులు మార్చడానికి జేవీకే యాప్‌లో నమోదుకు అవకాశం కల్పించింది. అలాగే బూట్ల మార్పిడికి షూ మేళాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా బ్యాగుల మార్పిడికి సంబంధించి ఉపాధ్యాయులు యాప్‌లో నమోదు చేశారు. బూట్లు కోసం మేళా చేపట్టారు. దసరా సెలవుల తర్వాత వీటి మార్పిడికి లక్షల్లో అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.


ఈ ఏడాది కానుక మొత్తం ఒకేసారి కాకుండా పుస్తకాలు, బ్యాగులు ఒకసారి, బెల్టులు, బూట్లు ఒకసారి, ఏకరూప దుస్తులు, డిక్షనరీలు విడతల వారీగా అందజేశారు. అందులో మొదటిగా ఇచ్చిన స్కూల్‌ బ్యాగులే నాసిరకంగా ఉన్నాయి. భుజానికి వేసుకున్న రోజునే బ్యాగులు చిరిగిపోయాయి..జిప్‌లు ఊడిపోయాయి.. తాళ్లు తెగిపోయాయి.. అప్పట్లోనే వీటి నాణ్యత లోపాని ఎత్తిచూపించినా గుత్తేదారు పట్టించుకోలేదు. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వమే వీటి నాణ్యతను పరిశీలించి బాగోలేవని నిర్ధారణకు వచ్చింది. వాటి స్థానంలో కొత్త బ్యాగులు సరఫరా చేయడానికి ఆదేశించింది. ఈ మేరకు జేవీకే యాప్‌లో మార్పులు చేసి నాసిరకం బ్యాగులను వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేశారు.

90 శాతం నాసిరకమే..

విద్యార్థులకు ఇచ్చిన స్కూల్‌ బ్యాగుల్లో సుమారు లక్ష బ్యాగులు పైనే మార్చాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో మొదటి విడతగా మూడు సైజుల్లో 1.2 లక్షలు బ్యాగులు జిల్లాకు వచ్చాయి. వీటిలో 90 శాతం నాసిరకంగానే ఉన్నాయి. చిరిగిన బ్యాగులనే భుజన వేసుకుని వస్తున్నవారు కొందరైతే.. సొంతంగా బ్యాగులు కొని తెచ్చుకుంటున్నవారు మరికొంతమంది. పాడైన వాటిని మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూనే ఉన్నారు. సెలవులకు కొద్ది రోజుల ముందే వీటి మార్పిడికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కొందరి వివరాలే నమోదు చేయగలిగారు.. సెలవుల తర్వాత భారీగానే మార్చడానికి అవకాశం ఉంది. బూట్ల విషయంలో విద్యార్థుల పాదాల కొలతలకు సరిపడా సరఫరా చేయలేదు. నచ్చిన కొలతలు పంపించేశారు. వాటిలో సరిపోయిన వాటిని విద్యార్థులకు ఇచ్చి మిగతా బూట్లను పాఠశాల నుంచి మండల స్థాయి వరకు మేళా నిర్వహించి మార్పులు చేశారు. ఇంకా అవసరమైన వాటి కోసం ఇతర జిల్లాలో మిగిలిన బూట్లను తెప్పించే ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 35 వేల వరకు స్కూల్‌ బ్యాగులు మిగులు నిల్వ ఉంచామని నాణ్యత లేని వాటి స్థానంలో మార్పు చేస్తున్నామని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శ్రీనివాసరావు చెప్పారు. యాప్‌లో నమోదు చేసిన తర్వాత మిగతా బ్యాగులు మార్చుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని