logo

కట్టుడు పళ్లు కట్టుకథేనా!

కశింకోటకు చెందిన రామారావుకు రోడ్డు ప్రమాదంలో దవడ భాగం దెబ్బతింది. క్రమేపీ దంతాలు మొత్తం ఊడిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తేరూ. 40 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు అంత ఖర్చుచేసే స్థోమత లేక కాలాన్ని అలానే గడిపేస్తున్నారు.

Published : 03 Oct 2022 03:32 IST

న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం

అనకాపల్లి ఆసుపత్రిలో దంత పరీక్షలు

కశింకోటకు చెందిన రామారావుకు రోడ్డు ప్రమాదంలో దవడ భాగం దెబ్బతింది. క్రమేపీ దంతాలు మొత్తం ఊడిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తేరూ. 40 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు అంత ఖర్చుచేసే స్థోమత లేక కాలాన్ని అలానే గడిపేస్తున్నారు.

ఎలమంచిలికి చెందిన రాజులమ్మ దంతాలు ఒక్కొక్కటీ ఊడిపోతున్నాయి. అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యుడికి చూపిస్తే కట్టుడు పళ్లు కడతామని చెప్పి పేరు రాసుకున్నారు. ఇది జరిగిన ఎనిమిది నెలలు గడిచినా రాలేదని చెపుతున్నారని రాజులమ్మ వాపోతోంది.

దంతాలు పోయిన వారికి పళ్లసెట్లను ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందించేందుకు గత ఏడాది సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ దంత సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నాణ్యమైన పళ్ల సెట్లు, కట్టుడు పళ్లు ఉచితంగా అమరుస్తారు. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి పరిధిలో 60 మందికి పైగా పేర్లు నమోదు చేశారు. వీరెవరికీ ఇంకా పళ్ల సెట్లు రాకపోవడంతో పేర్ల నమోదు ఆపేశారు.

 గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక దంత వైద్య సేవలు ఈనాటికీ అందనిద్రాక్షగానే ఉన్నాయి. అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు దంత వైద్యులు ఉన్నారు. చుట్టుపక్కల ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్యులు లేకపోవడంతో వారంలో మూడు రోజులపాటు ఒక వైద్యురాలిని పంపుతున్నారు. ఆసుపత్రిలో దంత వైద్యానికి సంబంధించి ఫిల్లింగ్‌, క్లీనింగ్‌, పళ్లు తీయడానికి మాత్రమే పరికరాలు ఉన్నాయి. డెంటల్‌ చైర్లు రెండు ఉన్నాయి. మరొకటి కావాలని ప్రతిపాదనలు పంపారు. జిల్లా ఆసుపత్రి కావడంతో గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన దంత సంరక్షణ పథకంలో పళ్ల సెట్లు, కట్టుడు పళ్ల కోసం చాలామంది మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంతకాలానికీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు ఆవేదన చెందుతున్నారు.

ల్యాబ్‌లు లేక..

కట్టుడు పళ్లు, పళ్ల సెట్లకు ముందుగా కొలతలు తీసుకుని, వాటి ప్రకారం తయారు చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ల్యాబ్‌ సదుపాయం అవసరం. ఇది లేకపోవడం వల్ల, ప్రైవేటు ల్యాబ్‌లతో ఒప్పందాలు కుదరక ఈ పథకం ముందుకు సాగడం లేదని తెలిసింది. మొత్తం పళ్ల సెట్‌ కోసం ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తే తక్కువలో రూ. 25 వేల వరకు అవుతుంది. కట్టుడు పళ్లకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు అవుతుంది. వీటిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తామని చెప్పడంతో చాలామంది రోగులు పేర్లు నమోదు చేసుకుని ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రికి రోడ్డు ప్రమాదాల్లో దవడ భాగంలో దెబ్బ తగిలి దంతాలు ఊడిపోయి వస్తున్న క్షతగాత్రులు ఎక్కువగా వస్తున్నారు. వీరికి తగిన వైద్యం అందించేలా దంతవైద్య సివిల్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా వాసులకు చికిత్స అందించే అవకాశం ఉంది.


సంబంధిత వైద్యులతో మాట్లాడతాం

దంత సంరక్షణ పథకం, దంత సెట్ల ఏర్పాటుపై సంబంధిత విభాగం సభ్యులతో మాట్లాడతాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం.

- శ్రావణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని