logo

ఫలించిన స్వచ్ఛ ప్రయత్నం!

స్వచ్ఛతలో విశాఖ నగరం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ర్యాంకుల్లో నాలుగో ర్యాంకు సాధించి, దేశంలోని అత్యున్నత నగరాల సరసన చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి పంపిన బృందం పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాలలో జీవీఎంసీకి మొదటి స్థానాన్ని ఇస్తూ అవార్డు ప్రకటించింది.

Published : 03 Oct 2022 03:32 IST

సమష్టి కృషితో 4వ ర్యాంకు సాధన

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

స్వచ్ఛతలో విశాఖ నగరం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ర్యాంకుల్లో నాలుగో ర్యాంకు సాధించి, దేశంలోని అత్యున్నత నగరాల సరసన చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి పంపిన బృందం పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాలలో జీవీఎంసీకి మొదటి స్థానాన్ని ఇస్తూ అవార్డు ప్రకటించింది.

* స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాలన్నీ మహానగరపాలక సంస్థ పాటించింది. చెత్త రహిత నగర(గార్బేజ్‌ ఫ్రీ సిటీ) విభాగంలో మంచి మార్కులు వచ్చాయి. 608 వాహనాలతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడం, ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు క్లోజ్డ్‌ కాంపాక్షన్‌ వాహనాలతో చెత్తను తరలించడం మంచి ఫలితమిచ్చింది.

* ఇటీవల కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో జీవీఎంసీ చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సైంటిఫిక్‌ ల్యాండ్‌ ఫిల్లింగ్‌ పనులు, బయోగ్యాస్‌ ఉత్పత్తి వంటి అంశాలు కూడా ఉత్తమ ర్యాంకు రావడానికి దోహద పడ్డాయి. ఓడీఎఫ్‌ విభాగంలో జీవీఎంసీ మంచి పనితీరు కనబరిచింది.

* నగర శివారు పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాలలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణ పనులు, టెర్షరీ ట్రీట్ మెంట్ (మూడో దశ శుద్ధి) ప్రాజెక్టుతోపాటు, నగరంలో ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి) కేంద్రాలను పునరుద్ధరించే పనులు ర్యాంకు సాధనకు ఉపకరించాయి. నగరంలో ప్లాస్టిక్‌ను నిషేధించడం, ఎక్కడికక్కడ ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ వస్తువులను నియంత్రించడంపై దృష్టి పెట్టారు. గతేడాది ఏయే అంశాల్లో వెనుకబడ్డారో విశ్లేషించుకుని.. ఆయా లోపాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేయడం కలిసొచ్చిందని చెబుతున్నారు.


వచ్చే ఏడాది మెరుగైన ర్యాంకు సాధిస్తాం..

రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది. జీవీఎంసీ గతంలో కంటే మెరుగైన ర్యాంకు సాధించడం వెనుక అధికారులు, కార్మికుల విశేష కృషి ఉంది. గత కమిషనర్‌ లక్ష్మీశ తీసుకున్న చర్యలు ఎంతగానో ఉపకరించాయి. వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి కృషి చేస్తాం.

- పి.రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని