logo

బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

జాతీయ రహదారి విశాఖ డెయిరీ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా వేపాడ మండలం వెలుపర్తి గ్రామానికి చెందిన కల్లకురస సతీశ్‌కుమార్‌(26) స్కూటీపై గాజువాక నుంచి ఎన్‌ఏడీకూడలి వైపు వెళ్తున్నాడు.

Published : 03 Oct 2022 03:32 IST

సతీశ్‌కుమార్‌ (పాతచిత్రం)

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : జాతీయ రహదారి విశాఖ డెయిరీ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా వేపాడ మండలం వెలుపర్తి గ్రామానికి చెందిన కల్లకురస సతీశ్‌కుమార్‌(26) స్కూటీపై గాజువాక నుంచి ఎన్‌ఏడీకూడలి వైపు వెళ్తున్నాడు. అదే మార్గంలో రాజమహేంద్రవరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు  వెనక నుంచి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన సతీశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. సతీశ్‌కుమార్‌ గాజువాకలో బంధువుల ఇంటి నుంచి తెల్లవారు జాము మూడు గంటల సమయంలో తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.


ఆసుపత్రి భవనంపై నుంచి పడి మరొకరు..

సంతోష్‌కుమార్‌ (పాతచిత్రం)

గోపాలపట్నం: చికిత్స పొందుతున్న యువకుడు ఆసుపత్రి భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన ఆదివారం గోపాలపట్నంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలేనికి చెందిన దాడి సంతోష్‌కుమార్‌ (30) అనారోగ్య సమస్యలతో ఇటీవలే గోపాలపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. భవనం రెండో అంతస్తు గదిలో చికిత్స పొందుతున్న సంతోష్‌కుమార్‌ వద్ద సహాయకురాలిగా అతని తల్లి ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున వైద్యసిబ్బంది గది తలుపులు తీయగా, మంచంపై సంతోష్‌ కనిపించలేదు. వెంటనే పరిసరాల్లో పరిశీలించగా అతడు భవనం పక్కన పడి తలకు తీవ్రగాయమై మృతి చెంది ఉన్నాడు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటానాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని