logo

Vizag: మద్యం మత్తులో దాడి.. పిడిగుద్దులకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

పార్కింగు విషయంలో తలెత్తిన స్వల్ప వివాదం ఒకరి మృతికి కారణమైంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి.

Updated : 04 Oct 2022 08:27 IST


నారాయణరావు (పాతచిత్రం)

గురుద్వారా, న్యూస్‌టుడే: పార్కింగు విషయంలో తలెత్తిన స్వల్ప వివాదం ఒకరి మృతికి కారణమైంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. కైలాసపురం సమీప లక్ష్మీనారాయణపురానికి చెందిన నాగబోయిన నారాయణరావు(75) ఉదయం సుమారు 8.30 గంటలకు ఇంటి మేడపై దినపత్రిక చదువుకుంటున్నారు. వీరి ఇంటి ఎదుటి రోడ్డుపై ఇతని రెండో కొడుకు గోపికి చెందిన ఆటో, దాని వెనుక అదే ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌(38) ద్విచక్రవాహనం ఉన్నాయి. గోపి ఆటో తీస్తుండగా అక్కడున్న దుర్గాప్రసాద్‌ పార్కింగ్‌ విషయమై దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగాడు. కుటుంబసభ్యులు గోపిని ఇంటిలోకి తీసుకెళ్తున్న సమయంలో ఇదంతా గమనిస్తున్న తండ్రి నారాయణరావు మేడపై నుంచి కిందికి వచ్చి ‘నా కొడుకుపై తిరగబడతావా’ అని గట్టిగా నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్‌ తొలుత ఆయన చెంపపై తర్వాత విచక్షణారహితంగా గుండెపై పిడిగుద్దులు గుద్దడంతో కుప్పకూలిపోయారు. స్థానికుల సమాచారం మేరకు చేరుకున్న 108 వాహన వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏసీపీ హర్షిత ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు నాలుగోపట్టణ సీఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.


దాడికి పాల్పడిన వ్యక్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని