logo

బకాయిల వసూలు ఎప్పుడో?

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నుంచి విశాఖపట్నం మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు రావాల్సిన సొమ్ములు జమ కావడం లేదు.

Published : 05 Oct 2022 04:44 IST

ఈనాడు, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నుంచి విశాఖపట్నం మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు రావాల్సిన సొమ్ములు జమ కావడం లేదు. కొన్నేళ్లుగా చెల్లించాల్సిన బకాయి సొమ్ము రూ.50 కోట్లకుపైగా ఉందని సమాచారం. వివిధ ప్రాజెక్టులు, ఒక సెంటు ప్లాట్ల అభివృద్ధితో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న వీఎంఆర్‌డీఏకు  ఈ నిధులు వస్తే కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. మాస్టర్‌ ప్లాన్‌, జోనల్‌ ప్లాన్‌, లేఅవుట్‌లు వేసే పూర్తి అధికారం వీఎంఆర్‌డీఏకే ఉంటుంది.
* వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసి ఇచ్చిన లేఅవుట్లకు మాత్రమే కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు అనుమతులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఆయా స్థానిక సంస్థలు అభివృద్ధి రుసుము (డెవలప్‌మెంట్‌ ఛార్జీ)లు చెల్లించాలి.  ఇలా వచ్చిన ఆదాయం  ఆర్థిక వనరుగా మారి వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికలో పేర్కొన్న పనులు పూర్తి చేయటానికి ఉపయోగపడుతుంది. ఏపీఐఐసీ నుంచి అప్పటి ‘వుడా’కు రావాల్సిన రూ. కోట్ల సొమ్మును గతంలోనే వసూలు చేశారు. జీవీఎంసీ విషయంలో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారు.
* ప్రతి ఆర్థిక సంవత్సరం అధికారికంగానే ఈ నిధులు చెల్లించాల్సి ఉన్నా... 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి పైసా కూడా వీఎంఆర్‌డీఏకు రాలేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా తొలివిడతగా రూ.కోటి చెల్లించాలని జీవీఎంసీకి 2007లో స్పష్టం చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత ప్రభుత్వాలు మారినా ఎవరూ పట్టించుకోలేదు.
* ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ పరిధిలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా ప్రణాళికా విభాగానికి వివిధ రుసుంల రూపంలో ఆదాయం వస్తుంది. డెవలప్‌మెంట్‌, ప్రాసెసింగ్‌, నోటిఫికేషన్‌, మార్పిడి, ఎల్‌ఆర్‌ఎస్‌ తదితర రుసుములు వసూలు చేస్తారు. వీటన్నింటి ద్వారా విశాఖ నుంచే ఎక్కువ ఆదాయం రావాల్సి ఉన్నా...ఆశించినంత ఉండటం లేదని వీఎంఆర్‌డీఏ యంత్రాంగం అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని