logo

శాంతమ్మా.. మీరు సూపరమ్మా!

వేదగణితం విస్తృతికి కృషి అవసరాన్ని బట్టి కాలాన్ని, శక్తిని ఉపయోగించాలి. వృథా చేసిన సమయాన్ని ఎంత ఖర్చు చేసినా తీసుకురాలేం. కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించలేం’ అంటారు ఆచార్య డాక్టర్‌ చిరుకూరి శాంతమ్మ.

Updated : 07 Oct 2022 08:52 IST

బోధనలో విశ్రమించని ఆచార్యురాలు

వేదగణితం విస్తృతికి కృషి అవసరాన్ని బట్టి కాలాన్ని, శక్తిని ఉపయోగించాలి. వృథా చేసిన సమయాన్ని ఎంత ఖర్చు చేసినా తీసుకురాలేం. కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించలేం’ అంటారు ఆచార్య డాక్టర్‌ చిరుకూరి శాంతమ్మ. అందుకేనేమో ఆమె తొమ్మిది పదుల వయసు దాటినా ఇప్పటికీ విద్యార్థులకు బోధన సాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వేద గణిత విస్తృతికి కృషి చేస్తున్నారు.

*  సాధారణ జీవనం..
విశాఖ మహానగరంలో విలాస  వంతంగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ అత్యంత సాధారణంగా కాలం గడుపుతున్నారు. ఒక మంచం, దాని ముందు చదువుకునే పుస్తకాలు, దుస్తులు, అవసరమైన మందులే ఉంటాయి. వంటకు చిన్న గదిలో అవసమైన సామగ్రి ఉంటాయి. శాంతమ్మది ముందు నుంచి ఆర్థికంగా ఉన్నత కుటుంబం. భర్త ఏయూ తెలుగు విభాగం ఆచార్యులుగా పని చేశారు. అయినప్పటికీ ఎటువంటి విలాసాలకు పోకుండా పురాతన, ఇతిహాస గ్రంథాలు చదువుకుంటూ వేద గణితాన్ని అధ్యయనం చేస్తున్నారు.
భౌతికశాస్త్రంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ చేసిన మొదటి మహిళ ఈమె. అప్పట్లో బ్రిటన్‌ ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ (ఎఫ్‌ఆర్‌సీ)కు చెందిన ఆచార్యుల పరిశీలనలో పట్టా పొందిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో ఆల్ట్రావైలట్‌ నుంచి రేడియోఫ్రీక్వెన్సీలపై విశేష పరిశోధనలు చేసి ప్రయోగశాలలను అభివృద్ధి చేసిన డా.రంగధామారావు మార్గదర్శకంలో ఆమె పరిశోధనలు చేశారు. ఆ తరువాత విశాఖలోని ఏయూలోనే 1947లో అధ్యాపకురాలిగా చేరి భౌతికశాస్త్ర విభాగం ఆచార్యులుగా 1989లో పదవీ విరమణ చేశారు. ఆమె ఆధ్వర్యంలో 17 మందికి పీహెచ్‌డీ డాక్టరేట్లు పొందారు. లేజర్‌ సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోల్‌లో మలినాల గుర్తింపు , అడ్వాన్స్‌ గ్రూప్‌ థియరీలపై యూజీసీ, డిపార్టుమెంటు ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) ప్రాజెక్టుల్లో ప్రిన్సిపల్‌ ఇన్విస్టిగేటర్‌గా చేశారు. అమెరికా, ఇంగ్లండ్‌, దక్షిణ కొరియాలోని విశ్వవిద్యాలయాలు శాంతమ్మను ఆహ్వానించి  విజ్ఞాన సంగతులు తెలుసుకున్నాయి.

*  సుప్రసిద్ధుల బోధనలతో: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో సుప్రసిద్ధులైన సూరిభగవంతం (ఈయన డిపార్టుమెంటు ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్యుడు), శేషాద్రిల ఆధ్వర్యంలో పాఠ్యాంశాలు నేర్చుకున్నారు. సీవీ రామన్‌ ఏయూకు వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చిన రెండు ప్రసంగాలు విని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అలాగే సర్వేపల్లి రాధకృష్ణన్‌, సీఆర్‌ రెడ్డిల ఉపన్యాసాలు విన్నారు.
అంతే చురుగ్గా: వయసు పైబడినా పాఠ్యాంశాలు బోధించాలనే ఆసక్తి శాంతమ్మలో తగ్గలేదు. తొమ్మిది పదుల వయసులోనూ అదే వాగ్ధాటి, అంతే జ్ఞాపకశక్తి. విద్యార్థులను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ (విజయనగరం సమీపంలో) వారానికి నాలుగు తరగతులు బోధిస్తారు. ఉదయం 7.30 గంటలకు వెళ్లి తిరిగి 6 గంటలకు ఇంటికి వస్తారు. రోజంతా అక్కడే గడుపుతారు. కళాశాలకు వెళ్లిన రోజుల్లో అలా నిత్యం రాను,పోను దాదాపు 60 కి.మీ. ప్రయాణం చేస్తారు. ఆ విశ్వవిద్యాలయంలో అనస్థీషియా, రేడియాలజీ , మెడికల్‌ ఫిజిక్స్‌ పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా ఆమె జీవితానుభవాలను పిల్లలతో పంచుకొని వారిలో స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఇందుకు వాహన ఖర్చు మినహా ఉచితంగా చెప్పడం విశేషం.

 ఎక్కడ సదస్సులు జరిగినా హాజరవుతుంటారు. కరోనా సమయంలో ఇంటికే పరిమితమయ్యారు. 30 ఏళ్లకే అనారోగ్యం బారిన పడుతున్న ఈ రోజుల్లో ఆమెకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేవు.
ఆ మక్కువతో: డా.శాంతమ్మకు బాల్యం నుంచి గణితం అంటే ఆసక్తి. ఇంటర్‌లో రసాయన, భౌతికశాస్త్రాల్లో ‘విక్రమ్‌దేవ్‌ బంగారు’ పతకం అందుకున్నారు. ఆ ఉత్సాహంతో (నాటి విక్రమ్‌ దేవ్‌ కళాశాల, నేటి ఏయూ ఏయూ భౌతికశాస్త్ర విభాగం) భౌతికశాస్త్ర బోధనకు చేరారు. అయినా గణితంపై మక్కువ పోలేదు.
జగద్గురు శంకరాచార్య భారతీకృష్ణతీర్థ మహారాజు రచించిన వేద గణితంలోని 29 సూత్రాలను శాంతమ్మ అయిదు పుస్తకాల్లో తీసుకొచ్చారు. వీటిని ఇప్పటి వరకు ఆరుసార్లు ముద్రించారు. వేదిక్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ల్లో ఆమె రాసిన అయిదు పుస్తకాలు ప్రదర్శిస్తుంటారు. వేదగణిత సూత్రాల్లో ఒక గణితాంశానికి ఆ సూత్రంలోనే సమస్యా పరిష్కారం ఉంటుందని, చాలా సులభమని విశ్లేషించారు.
ఆమె ఒక గణిత సూత్రాన్ని తీసుకొని పాశ్చాత్య విధానం, వేదగణితంలో చేసి చూపించి ఎంత సులభమో వివరింస్తుంటారు. ఆసక్తిగా నేర్చుకుంటే నెల రోజుల్లో పట్టు సాధించొచ్చంటున్నారు.
దేశంలో బోధన కొనసాగిస్తున్న అత్యంత వృద్ధురాలైన ప్రొఫెసర్‌గా ఆచార్య శాంతమ్మ పేరును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు ప్రతిపాదన పంపినట్లు సెంచూరియన్‌ వర్సిటీ ఉప కులపతి జీఎస్‌ఎన్‌ రాజు పేర్కొన్నారు. ఈయన కూడా గతంలో ఆమె శిష్యుడే.
మన మూలాలే బోధనాంశాలు కావాలి: ‘ప్రస్తుతం బ్రిటీష్‌ గణిత విధానాలను మన పాఠ్యంశాలలో పొందుపరిచారు. వాటినే నేర్చుకుంటున్నాం. వాటికి బదులు వేదాల్లో నిక్షిప్తమై ఉన్న వేదగణితాంశాలను పాఠ్యాంశాల్లో చేర్చి పిల్లలకు నేర్పిస్తే మంచిది. మన మూలాలకు చెందిన వేదగణితాన్ని బోధనాంశాలుగా చేర్చాలి. అందుకూ ఎవరూ ధైర్యం
డం లేదు’ అని ఆచార్య శాంతమ్మ పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని