logo

జగనన్నా.. కాలనీకి దారేదన్నా?: పరిహారం చెల్లించక రోడ్డును తవ్వేసిన రైతులు

మునగపాక ఎస్సీ కాలనీని ఆనుకొని ఏర్పాటుచేసిన జగనన్న కాలనీ రహదారి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. తమ జిరాయితీ భూముల్లో నుంచి ఏర్పాటు చేసిన రహదారికి పరిహారం చెల్లించేవరకు కాలనీలోకి ఏ వాహనం వెళ్లనీయమని రహదారికి అడ్డంగా ట్రెంచ్‌ తవ్వేశారు.

Updated : 17 Oct 2022 09:08 IST


కాలనీకి వెళ్లే రహదారికి అడ్డంగా తవ్విన ట్రెంచి

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక ఎస్సీ కాలనీని ఆనుకొని ఏర్పాటుచేసిన జగనన్న కాలనీ రహదారి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. తమ జిరాయితీ భూముల్లో నుంచి ఏర్పాటు చేసిన రహదారికి పరిహారం చెల్లించేవరకు కాలనీలోకి ఏ వాహనం వెళ్లనీయమని రహదారికి అడ్డంగా ట్రెంచ్‌ తవ్వేశారు. దీంతో రెండు రోజులుగా కాలనీకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణ సామగ్రి తరలించే సౌకర్యం లేక లబ్ధిదారులు పనులు నిలిపేశారు. గూడులేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు గృహాలు నిర్మించేందుకు ఎస్సీ కాలనీని ఆనుకొని నాలుగు ఎకరాల స్థలం  రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆ స్థలానికి ఎస్సీ కాలనీలో నుంచే వెళ్లాలి. ఆ రహదారి అంతా ఇరుగ్గా ఉంటుంది. మునగపాక - పాటిపల్లి మార్గం నుంచి రైతుల పొలాల్లోని దగ్గర మార్గంలో రహదారి ఏర్పాటుచేయాలని అధికారులు తలిచారు. రహదారి ఏర్పాటుకు ఇచ్చే స్థలానికి బదులుగా నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. శరగడం ఆదియ్య, దొడ్డి గణేష్‌ పంట పొలాల్లో నుంచి రహదారిని ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. రహదారి అయితే ఏర్పాటు చేశారు తప్ప ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రైతులు శరగడం అప్పారావు, దొడ్డి గణేష్‌, రామకృష్ణ తదితరులు తెలిపారు. సామగ్రి తీసుకెళ్లే మార్గం లేక గృహ నిర్మాణదారులు పనులు నిలుపుదల చేశారు. ‘ఇంటి నిర్మాణం చేపట్టకపోతే పట్టా రద్దు చేస్తామంటున్నారు. నిర్మాణం చేపడదామంటే దారి లేకుండా చేస్తున్నారు. మా పరిస్థితి ఎలా అంటూ’ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  రహదారి సమస్యను తహసీల్దార్‌ బాబ్జీ వద్ద ప్రస్తావించగా సోమవారం రహదారిని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని