logo

కుట్లు వేయడానికి కాసుల కటకట!

ఇప్పటివరకు ఒక సమస్య... ఇక నుంచి మరో సమస్య అన్నట్లుగా మారింది అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి పరిస్థితి. నిన్న, మొన్నటివరకు నిపుణులైన వైద్యులు (స్పెషలిస్టులు) లేకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందేవి కావు.

Published : 24 Nov 2022 05:04 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

ఇప్పటివరకు ఒక సమస్య... ఇక నుంచి మరో సమస్య అన్నట్లుగా మారింది అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి పరిస్థితి. నిన్న, మొన్నటివరకు నిపుణులైన వైద్యులు (స్పెషలిస్టులు) లేకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందేవి కావు.

ప్రభుత్వం ఇటీవల వైద్యుల భర్తీలో భాగంగా ఆసుపత్రికి ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జన్‌, కంటి వైద్య, గైనిక్‌ సర్జన్లను నియమించింది. దీంతో శస్త్రచికిత్సలకు విశాఖపట్నం పంపాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సల కోసం కేటాయించిన బడ్జెట్‌ పరిమితంగా ఉంది. సర్జికల్‌ సామగ్రి ఇక్కడ ఉండటం లేదు. వీటిని బయట కొనుగోలు చేయడం భారమవుతోంది. దీంతో వైద్యులు రోగులకు శస్త్ర చికిత్సలు చేయడానికి ఆలోచించాల్సి వస్తోంది.

అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో మూడునెలల సర్జికల్‌ బడ్జెట్‌కి రూ. 3.95 లక్షలు కేటాయిస్తున్నారు. ఈ నిధులతోనే సెంట్రల్‌ స్టోర్‌ డ్రగ్స్‌ కార్యాలయం నుంచి సామగ్రి తెచ్చుకోవాలి. నెల రోజుల నుంచి శస్త్రచికిత్సలకు కావాల్సిన సామగ్రిని బయట కొనుగోలు చేస్తున్నారు. ఐటీ సెట్‌లు, క్యానల్స్‌, సిరంజ్‌లు, కెట్‌గట్స్‌ (కట్లు కుట్టడానికి), గ్లౌజులు, కాటన్‌, దూది, ప్లాస్టర్లు, ఒకసారి వాడిపారేసే బెడ్‌ షీట్స్‌, యూరిన్‌ బ్యాగ్స్‌, పైప్స్‌, పాలిన్‌ మెస్‌లతోపాటు ఆర్థో, ఈఎన్‌టీ, కంటి శస్త్రచికిత్సలకు అవసరమయ్యే మందులు బయట నుంచి తెస్తున్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరుకు సంబంధించి నిధులు ఇప్పటికే ఖర్చయిపోయాయి. దీంతో ఇకపై చేయాల్సిన శస్త్రచికిత్సలకు సామగ్రి ఎక్కడి నుంచి తేవాలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అత్యవసర సర్జరీలు మినహా మిగతావాటిని చేయడానికి ఆలోచించాల్సి వస్తోంది.

ఆరోగ్యశ్రీ బిల్లులో కోత: ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే బిల్లుల్లో గతంలో ఖర్చులు చేసేవారు. ప్రైవేటుగా ఏ అవసరం ఉన్నా ఈ నిధులను వెచ్చించేవారు. ఇప్పుడు ప్రభుత్వమే 40 శాతం నిధులను ఏపీ వైద్య, విద్య పరిశోధన సంస్థ తీసేసుకుంటోంది. దీంతో ఈ బిల్లుల్లో ఖర్చు చేయడానికి ఆసుపత్రికి నిధులు తక్కువగా ఉంటున్నాయి.


పెరిగిన రోగులు...

అనకాపల్లి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల నియామకంతో ఓపీ రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు 1000 నుంచి 1200 మంది వస్తున్నారు. మూడునెలలకు మందుల బడ్జెట్‌ కింద రూ. 35.42లక్షలు కేటాయిస్తారు. రోగుల రద్దీకి ఈ బడ్జెట్‌ సరిపోతుంది. అయితే సర్జికల్‌ బడ్జెట్‌ మాత్రం సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో స్పెషలిస్టు వైద్యులు లేక జనరల్‌, ఆర్థో, ఈఎన్‌టీ సర్జరీలు తక్కువగా జరిగేవి. రెండేళ్లుగా తగ్గిన శస్త్రచికిత్సలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించామని చెబుతున్నారు. కొవిడ్‌ రోజుల్లో ప్రసూతి మినహా మిగిలిన శస్త్రచికిత్సలు ఆసుపత్రిలో చేయలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం లెక్కలు ఇప్పుడు లెక్కించి సర్జికల్‌ బడ్జెట్‌ కేటాయించడం దారుణమని వైద్య సిబ్బంది అంటున్నారు.


ఉన్నతాధికారులకు నివేదిక పంపాం

- డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, అనకాపల్లి

అనకాపల్లి ఆసుపత్రికి సర్జికల్‌ బడ్జెట్‌ నిధులు పెంచాలని ఉన్నతాధికారులను కోరాం. స్పెషలిస్టు వైద్యులు రావడంతో రోగుల రద్దీ, శస్త్రచికిత్సలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే నిధులు పెంచాలని కోరాం. ఆపరేషన్లకు అవసరమైన సామగ్రి బయట కొనుగోలు చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, దాతలు ఇచ్చిన నగదుతో సామగ్రి కొనుగోలు చేస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని