logo

ఆఖర్లో ముంచిన అకాల వర్షాలు

అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఆరుగాలం అష్టకష్టాలు పడి వరి సాగు చేసిన అన్నదాతను పంట ఇంటికి వచ్చే వేళలో వర్షాలు నిలువునా ముంచాయి.

Published : 26 Nov 2022 02:32 IST

చీడికాడలోని తడిసిన వరి పంట

చీడికాడ, మాడుగుల గ్రామీణం, ఎలమంచిలి, అచ్యుతాపురం, కశింకోట - న్యూస్‌టుడే: అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఆరుగాలం అష్టకష్టాలు పడి వరి సాగు చేసిన అన్నదాతను పంట ఇంటికి వచ్చే వేళలో వర్షాలు నిలువునా ముంచాయి. బుధ, గురువారాల్లో రైతులు కోత కోశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోత కోసిన వరి పంట తడిసి ముద్దయ్యింది. శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం నుంచి పొగ మంచు ఆవరించింది. చాలాచోట్ల చిరుజల్లులు పడ్డాయి. మరోవైపు పండిన పంటను కోయలేక రైతులు ఆకాశంవైపు దిగాలుగా చూస్తున్నారు.  

జిల్లాలోని పరవాడ, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో వరిని సాగుచేశారు.  ఎలమంచిలి నియోజకవర్గంలో 18వేల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడులు వస్తాయని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆర్‌జీఎల్‌ రకం కోత దశలో ఉండగా బీపీటీ రకం ఇప్పటికే కోసివేశారు.   మాడుగుల మండలంలో 8 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు.  కోతలు ప్రారంభమయ్యాయి. సుమారుగా 20 శాతం పలు గ్రామాల్లో రైతులు కోతలు కోశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పనలు తడిసిపోయాయి. కోతకు  సిద్ధంగా ఉన్న వరి పొలాలు నేలవాలాయి.  

పంటను రక్షించుకునేందుకు ఇలా..

రావికమతం, బుచ్చెయ్యపేట, దేవరాపల్లి, రోలుగుంట, న్యూస్‌టుడే: కోసిన వరి పనలు మడుల్లోనే ఉండిపోవడంతో చాలా వరకు తడిసిపోయాయి. పండిన వరి పంటను కోయకపోతే వెన్ను రాలిపోయే ప్రమాదముంది. అలాగని కోతకోసి పొలంలో పనలుగా ఉంచితే వర్షానికి తడిసి ముద్దయి,  తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిచిన వరి పనల్ని గట్టుపైకి చేర్చి కుప్పలుగా పెట్టేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొందరు రైతులు మడుల్లోనే చిన్న చిన్న కుప్పలు పెట్టి పంటను కాపాడుకుంటున్నారు. పొలాల్లో దారులు ఏర్పాటుచేసి నీరు నిలిచిపోకుండా ప్రయత్నిస్తున్నారు. గున్నెంపూడి, నీలకంఠాపురం, పెదమదిన తదితర గ్రామాల్లో కోతలు కోసి వరిపనలను ఆరబెట్టారు. పొలాల్లో రెండు, మూడు రోజులు ఎండిన తర్వాత పంటంతా ఓ చోటకి చేర్చి కుప్పలుగా పెడతారు. ఇదే సమయంలో వర్షాలు కురవడంతో వరిపనలు తడిసిపోయాయి. రోలుగుంట, కొవ్వూరు, కె.నాయుడిపాలెం, గుండుబాడు, బలిజిపాలెం తదితర ప్రాంతాల్లోని వరి పనలు ముంపు బారిన పడ్డాయి. మరికొన్నిచోట్ల బురదలోకి వాలిపోవడంతో  గింజల రంగు మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వీటికి మార్కెట్‌లో ధరలు పలకవని ఆందోళన చెందుతున్నారు. దేవరాపల్లి మండలంలో సుమారు 30 ఎకరాల్లో ఖరీఫ్‌ వరికి నష్టం వాటిల్లింది.


ధాన్యం తడిసిపోయింది

- శ్రీను, రైతు ఒమ్మలి

సాగు పెట్టుబడులు పెరిగాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు వేశాను. మూడు ఎకరాల్లో కోత కోశాను. ఒక ఎకరా చేను కళ్లంకు తరలించాం. రెండు ఎకరాల చేను తడిసి ముద్దయ్యింది. వర్షం మరో రెండు రోజులు కొనసాగితే అంతా నష్టమే. ధాన్యం అమ్మి అప్పులు తీరుద్దామనుకున్నా.


కోతలు కోయొద్దు

- వాసుదేవరావు, ఏవో, మాడుగుల

వారం రోజుల నుంచి కోతలు కోయవద్దని వీఏఏల ద్వారా తెలియజేస్తున్నాం. గతవారంలో అయిదు శాతం మంది రైతులు కోతలు కోశారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పండిన పొలాల్లో రైతులు  కాలువలు తీసుకోవాలి. పొలాల్లో నీరు నిల్వ ఉండకూడదు. తడిసిన పనలు మొలకలు రాకుండా వరిపై ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.        

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు