logo

నర్సీపట్నంలో సీఎం పర్యటన డిసెంబరులో..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరులో నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ శుక్రవారం పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 02:32 IST

పేర్రాజుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే గణేష్‌

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరులో నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ శుక్రవారం పేర్కొన్నారు. మాకవరపాలెం మండలంలో రూ.500 కోట్లతో తలపెట్టిన వైద్యకళాశాల, రూ.470 కోట్లతో చేపట్టనున్న ఏలేరు, తాండవ జలాశయ అనుసంధాన ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. తాడేపల్లిలో గురువారం సీఎంను కలిసినప్పుడు పర్యటనను ఖరారు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. పరిష్కారానికి అవసరమైన నిధులిచ్చేందుకు సుముఖత చూపారని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెడతానని వివరించారు. గొలుగొండ పర్యటనలో జరిగిన ప్రమాదంలో కాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగి 50 రోజులపాటు ఆసుపత్రి, ఇంటికే పరిమితం కావాల్సివచ్చిందన్నారు. వైద్యుల సూచన మేరకు వీల్‌ఛైర్లోనే గ్రామాల్లో పర్యటిస్తానని, నాతవరం మండలం శృంగవరం నుంచి పర్యటన మొదలవుతుందని చెప్పారు. ఇప్పటివరకు 34 సచివాలయాల పరిధిలో 61 గ్రామాల్లో గడపగడపకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.6.3 కోట్లు మంజూరు చేశామన్నారు. ధర్మసాగరం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు గెడ్డం పేర్రాజు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గణేష్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ధర్మసాగరం సర్పంచి కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని