logo

రైలులో సీటు దొరకడం గగనమే..!

రిజర్వేషన్‌ లేని, జరిమానా విధించిన పత్రాలతో వేలాది మంది ప్రయాణిస్తుండటంతో విశాఖ వచ్చే సరికి ఇక్కడి ప్రయాణికులు బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు గంటల తరబడి స్టేషన్‌లో నిలిచిపోతోంది.

Published : 26 Nov 2022 02:32 IST

స్లీపర్‌ బోగీల్లో భారీగా కోత

సాధారణ ప్రయాణికుల అష్టకష్టాలు

న్యూస్‌టుడే, రైల్వేస్టేషన్‌

ఇటీవల బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అగ్ని పరీక్ష పెడుతోంది. స్లీపర్‌ బోగీలో రిజర్వేషన్‌ చేసుకున్నా.. సీటు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. 

బొకారో రైలు వద్ద ప్రయాణికుల రద్దీ

రిజర్వేషన్‌ లేని, జరిమానా విధించిన పత్రాలతో వేలాది మంది ప్రయాణిస్తుండటంతో విశాఖ వచ్చే సరికి ఇక్కడి ప్రయాణికులు బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు గంటల తరబడి స్టేషన్‌లో నిలిచిపోతోంది. చివరికి అధికారులు రిజర్వేషన్‌ లేని, జరిమానా విధించిన వారిని కిందికి దించేయాల్సి వస్తోంది.

ఇటీవల విశాఖ, అనకాపల్లి, ఎలమంచిలి స్టేషన్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. స్లీపర్‌ బోగీల్లో భారీగా కోత విధించడమే దీనికి కారణమని తేలింది. ఈ రైలుకు గతంలో 10 వరకు స్లీపర్‌ బోగీలు ఉండేవి. ఎల్‌హెచ్‌బీ బోగీలు ఏర్పాటు తర్వాత స్లీపర్‌ బోగీలను 5కు తగ్గించేశారు. థర్ట్‌ ఏసీ బోగీలను ఆరుకు, సెకండ్‌ ఏసీ బోగీలను నాలుగుకు పెంచేశారు.

దాదాపు అన్ని రైళ్లలోనూ..: విశాఖ మీదుగా రాకపోకలు సాగించే దాదాపు అన్ని రైళ్లలోనూ స్లీపర్‌ బోగీల్లో కోత విధించారు. గతంలో అన్ని రైళ్లలో ఇవి 10 నుంచి 12 వరకు ఉండేవి. కోరమండల్‌, మెయిల్‌ రైళ్లలో వీటిని సగానికి తగ్గించేశారు. ఆ స్థానంలో ఏసీ బోగీలను జత చేశారు. సాధారణ బోగీల్లో 72 సీట్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 80 వరకు ఉంటాయని, అందుకే స్లీపర్‌ బోగీలను తగ్గించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎల్‌హెచ్‌బీ బోగీ వల్ల 8 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఈ లెక్కన ఒక్క స్లీపర్‌ బోగీ తగ్గిస్తే సరిపోతుంది. కాని సగానికి పైగా కోత పెట్టడం సాధారణ ప్రయాణికులకు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం ఒక్క ఫలక్‌నుమా రైలులోనే 12 స్లీపర్‌ బోగీలు కనిపిస్తున్నాయి.


ఆర్థికంగా ఎంతో భారం

ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు దూర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి. వీరిలో ఎక్కువ శాతం రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. టికెట్‌ ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఉదాహరణకు విశాఖ నుంచి విజయవాడకు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో వెళ్లాలంటే రూ.750 ఛార్జి చెల్లించాలి. నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 3,000 ఖర్చవుతుంది. రైలులోని సాధారణ బోగీలో ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.150తో విజయవాడ చేరుకోవచ్చు. స్లీపర్‌ బోగీలో అయితే రూ.270 వరకు అవుతుంది. నలుగురు కుటుంబ సభ్యులకు రూ.1080 ఖర్చవుతుంది. బస్సుతో పోలిస్తే ఇది రెండు రెట్లు తక్కువ.


ఏసీ కోచ్‌లు పెంచడం వెనుక..

విశాఖ స్టేషన్‌ వద్ద రిజర్వేషన్‌ లేని ప్రయాణికులకు దించేసిన దృశ్యం (పాతచిత్రం)

విశాఖ మీదుగా నడుస్తున్న అన్ని రైళ్లలో స్లీపర్‌, థర్డ్‌ ఏసీ కోచ్‌లు దాదాపు సమానంగా ఉన్నాయి. కొన్నింటిలో ఏసీ బోగీలు ఎక్కుగా ఉన్నాయి. కోరమండల్‌, మెయిల్‌ రైళ్లు దీనికి ఉదాహరణ. స్లీపర్‌ బోగీలో టికెట్‌ దొరక్కపోతే థర్డ్‌ ఏసీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇందులో ఛార్జి స్లీపర్‌ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. ఉదాహరణకు విశాఖ నుంచి విజయవాడకు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ ఛార్జీ రూ.270 వరకు ఉండగా, థర్డ్‌ ఏసీలో అయితే రూ.700 అవుతుంది. స్లీపర్‌ బోగీలు తగ్గించి, థర్డ్‌ ఏసీ కోచ్‌లు పెంచడం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుండగా, రైల్వేకు ఆదాయం పెరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని