logo

రక్షణ దళాల్లోకి రాచబాట

విద్యార్థి దశలోనే త్రివిధ దళాలపై ఆసక్తిని పెంచుకోవడం, క్రమశిక్షణ, దేశభక్తితో చిరుతల్లా కదిలే యువత ఎన్‌సీసీ బాట పడుతోంది.

Published : 27 Nov 2022 05:04 IST

ఎన్‌సీసీ దినోత్సవం నేడు

కవాతు చేస్తున్న క్యాడెట్లు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే త్రివిధ దళాలపై ఆసక్తిని పెంచుకోవడం, క్రమశిక్షణ, దేశభక్తితో చిరుతల్లా కదిలే యువత ఎన్‌సీసీ బాట పడుతోంది. రక్షణ దళాల్లో చేరాలనుకునే వారంతా దగ్గరి దారిగా దీన్ని ఎంచుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకత చాటుకునేందుకు ఈ శిక్షణ బాటలు వేస్తోంది. ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘న్యూస్‌టుడే’ కథనం.

దేశ రక్షణలో నిమగ్నమై, ఆర్మీ దుస్తుల్లో సగర్వంగా పనిచేేయాలన్న కోరిక యువతను ఉర్రూతలూగించడం సహజమే. యువ సైన్యాన్ని ఆకర్షించేలా చదువుకునే వయసు నుంచే సైన్యంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఎన్‌సీసీని ఏర్పాటు చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ప్రతీకగా మూడు రంగులు (ఎరుపు, నేవీ బ్లూ, లైట్‌బ్లూ)తో ఉన్న జెండాను ఎన్‌సీసీ క్యాడెట్లు ధరిస్తుంటారు. ఎన్‌సీసీలో చేరితే ఉన్నత పాఠశాల స్థాయిలో ‘ఎ’, జూనియర్‌ కళాశాల స్థాయిలో ‘బి’, డిగ్రీ స్థాయిలో ‘సి’ ధ్రువపత్రం అందుకోవచ్చు. ఈఏపీసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. ఆర్మీలో చేరాలనుకునే వారికి రాత పరీక్ష లేకుండానే దేహ దారుఢ్య పరీక్షలు చేసి నేరుగా అవకాశం కల్పిస్తున్నారు. రిపబ్లిక్‌ పరేడ్‌కు హాజరవుతున్నారు. పాయకరావుపేటలోని స్పేసెస్‌ డిగ్రీ కళాశాలలో యువతీ, యువకులు ఎన్‌సీసీలో శిక్షణ పొందుతున్నారు. ట్రెక్కింగ్‌, రైఫిల్‌ షూటింగు, మార్చ్‌ఫాస్ట్‌ల్లో తర్ఫీదు తీసుకుంటున్నారు.


 రిపబ్లిక్‌ పరేడ్‌లో పాల్గొనాలనే..
- జి.వి.ఎస్‌.రమణి,   సీహెచ్‌.హేమలత

రిపబ్లిక్‌ పరేడ్‌లో పాల్గొనాలన్నదే మా లక్ష్యం. చదువులో రాణిస్తూనే శిక్షణ పొందుతున్నాం. సమాజంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఎదుర్కొనే సత్తా అలవడుతోంది. ట్రెక్కింగుకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగ సాధనలో ఎన్‌సీసీ ఉపయోగపడుతోంది.


సైనిక శిబిరంలో పాల్గొన్నాం
- ఎస్‌.భాస్కర్‌,  కె.ప్రేమ్‌చందు, సూర్యనారాయణ

సికింద్రాబాద్‌లో నిర్వహించిన సైనిక శిబిరంలో పాల్గొన్నాం. అక్కడ ఆయుధాల వినియోగం, సైన్యం చేతిలో ఉన్న అధునాతన ఆయుధ సంపత్తిపై అవగాహన కల్పించారు. చిన్నప్పట్నించి సైన్యంలో చేరాలనే కోరిక ఉంది. దీంతో ఎన్‌సీసీలో చేరాం. క్రమశిక్షణ అలవాటవుతుంది. సమాజం పట్ల బాధ్యత, సామాజిక సేవ చేయాలనే దృక్పథం మరింత పెరిగింది.


బాలికలూ ఆసక్తి  చూపుతున్నారు
- అశ్విని, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌

ఎన్‌సీసీలో చేరేందుకు బాలికలూ ఆసక్తి చూపుతున్నారు. శిక్షణ తీసుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు. రైఫిల్‌ షూటింగు, మార్చ్‌ఫాస్ట్‌ ఏదైనా ముందంజలో ఉంటున్నారు. దేశభక్తి పెరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని