logo

చూసేదెవరు.. ఆపేదెవరు?!

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. వీటి పరిశీలన... పరిష్కారం ఉన్నతాధికారులకు పెనుసవాలుగా మారింది.

Published : 27 Nov 2022 05:11 IST

అక్రమ కట్టడాలపై భారీగా ఫిర్యాదులు
టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి వినతుల వెల్లువ

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. వీటి పరిశీలన... పరిష్కారం ఉన్నతాధికారులకు పెనుసవాలుగా మారింది.

* ఫిర్యాదు అందిన తరువాత కూడా వాటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని కిందిస్థాయి అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ప్రతిసారి ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి పరిష్కరించాల్సిన ఫిర్యాదులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ ఫిర్యాదులు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది.

* మరో వైపు కొందరు కిందిస్థాయి  ఉద్యోగులు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ‘స్పందన’ కార్యక్రమానికి టౌన్‌ ప్లానింగ్‌ విభాగ ఏసీపీలు హాజరుకారు. జోనల్‌ కార్యాలయాల్లో జరిగే ‘స్పందన’లో పాల్గొంటారు. జీవీఎంసీలో వచ్చిన ఫిర్యాదులను వీరు మళ్లీ తెలుసుకొని ముందుకు సాగాల్సి వస్తోంది.  ఈ క్రమంలో జాప్యం జరుగుతోంది.

ఎన్నెన్ని ఫిర్యాదులో..

* భవన నిర్మాణానికి దరఖాస్తు చేస్తే అనుమతులు రావటానికి చాలా రోజులు పడుతోంది.

* దరఖాస్తును పరిశీలించి సవరించుకోవాల్సిన అంశాలుంటే అధికారులు వాటిని చెప్పాలి. అలా సకాలంలో చెప్పడంలేదు.

* అధికారులు సూచించిన విధంగా తప్పిదాలను సవరించినా..అనుమతులకు జాప్యం చేస్తున్నారు.

* నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తి చేసినా ఆక్యుపెన్సీ పత్రాలు ఇవ్వడంలోనూ తాత్సారం జరుగుతోంది.

* నిబంధనలకు విరుద్ధంగా సాగే నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే... ఫిర్యాదుదారుల పేర్లు,  వారి ఫోన్‌ నంబర్లను వాటి యజమానులకు జీవీఎంసీలోని కొందరు చేరవేస్తుండటం గమనార్హం. దీంతో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

* గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని జీవీఎంసీలోని సిబ్బందే బయటకు పంపిస్తున్నారని పలువురు చెబుతున్నారు.

* అక్రమ నిర్మాణమని అధికారులు నిర్ధరించిన తరువాత కూడా యజమానికి అనుకూలంగా.. స్వల్పంగా నిర్మాణాలు తొలగించి ఆ తరువాత ఆపేస్తున్నారనే విమర్శలెన్నో.

* కొన్ని ఫిర్యాదులైతే అసలు ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియదు అన్నట్లు ఉంది.

* ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు.

* అక్రమంగా నిర్మించిన కొన్ని నిర్మాణాలకు ఇంటి పన్నులు కూడా విధిస్తున్నారు.

* అక్రమ నిర్మాణదారులు కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పి నిర్భీతిగా కట్టేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తే పరిశీలనకు అధికారులు జంకుతున్నారు. కొందరు చిన్నచిన్న నాయకులు కూడా టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగులపై ఒత్తిళ్లు తెచ్చి..చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు.

* జీవీఎంసీ ఉద్యోగులు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూశాయి. తమ పలుకుబడిని అడ్డంపెట్టుకుని అధికార దుర్వియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జీవీఎంసీకి వచ్చిన ఫిర్యాదులు: 1,000 (సుమారు)
అధిక ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగం స్థానం: 2


కఠిన చర్యలు తప్పవు..

-పి.రాజాబాబు, కమిషనర్‌, జీవీఎంసీ

భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. అలాంటి ఫిర్యాదులను సమగ్రంగా అధ్యయనం చేసి బాధితుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రత్యేకంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ రోజు టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి చెందిన ఏసీపీలు కూడా హాజరవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని